చత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బా జిల్లాలో చోటుచేసుకున్న ఓ వింత దొంగతనం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సాధారణంగా దొంగలు నగదు, బంగారం లేదా విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులనే లక్ష్యంగా చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం దొంగలు హద్దులు దాటి ఏకంగా 60 అడుగుల పొడవైన భారీ ఇనుప వంతెననే రాత్రికి రాత్రే మాయం చేశారు. దాదాపు 40 టన్నుల బరువున్న ఈ వంతెనను పక్కా ప్రణాళికతో దొంగిలించిన తీరు చూస్తే… ఇది నిజ జీవితంలో జరిగిన సినిమా సన్నివేశంలా అనిపిస్తోంది.
శనివారం రాత్రి 11 గంటల వరకూ ప్రజలు ఆ వంతెనపై నిర్బంధం లేకుండా రాకపోకలు సాగించారు. కానీ తెల్లవారేసరికి అక్కడ వంతెన ఆనవాళ్లే కనిపించకపోవడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. “ఒక్క రాత్రిలో వంతెన ఏమైపోయింది?” అంటూ అవాక్కయ్యారు.
సుమారు 40 ఏళ్ల క్రితం ప్రజా రవాణా అవసరాల కోసం నిర్మించిన ఈ వంతెనను రైల్వే ట్రాక్ తరహాలో భారీ ఇనుప గడ్డర్లు, మందపాటి ప్లేట్లతో పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఇంత భారీ నిర్మాణాన్ని తొలగించేందుకు దొంగలు గ్యాస్ కట్టర్లను వినియోగించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాలువకు ఇరువైపులా వంతెనను కత్తిరించిన స్పష్టమైన గుర్తులు అక్కడ కనిపిస్తున్నాయి.
ఇదే కాదు… నగర తాగునీటి సరఫరా వ్యవస్థను కాపాడే 40 అడుగుల పొడవైన ఇనుప యాంగిల్స్‌ను కూడా దొంగలు వదలలేదు. ఈ ఘటనతో సుమారు 2.5 లక్షల మందికి తాగునీరు అందించే ప్రధాన పైప్‌లైన్ తీవ్ర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుందని అధికారులు వెల్లడించారు.
ఈ మొత్తం చోరీ వెనుక పెద్ద ముఠా ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగిలించిన ఇనుము విలువ సుమారు 15 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక భారీ వంతెనను విడగొట్టి, వాహనాల్లో తరలించాలంటే కనీసం కొన్ని గంటల సమయం అవసరం. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారం ఎవరి దృష్టికి రాకుండా జరగడం గమనార్హంగా మారింది.
ఈ ఘటన కారణంగా ప్రజల రాకపోకలకు కీలకమైన వంతెనను కోల్పోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక కౌన్సిలర్ లక్ష్మణ్ శ్రీవాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి స్థానిక స్క్రాప్ డీలర్ల వద్ద సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. వంతెననే మాయం చేసిన ఈ భారీ దొంగతనం ఇప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.



