సాధారణంగా తిరునాళ్లు, జాతరలు, పండుగల సమయంలో చెరుకుగడలు అమ్ముతూ కనిపిస్తుంటాయి. ఆ సమయంలో కొద్దిసేపు చెరకు నములితే నోటికి వచ్చే తీపి అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అయితే చెరకు కేవలం రుచికే పరిమితం కాదు. అది మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేసే సహజ ఆరోగ్య ఆహారం.
పూర్వకాలంలో మన పెద్దలు చెరకును ఆస్వాదిస్తూ నమిలి తినేవారు. కానీ నేటి తరం మాత్రం “పళ్ళకు హాని చేస్తుందేమో”, “జలుబు వస్తుందేమో” అన్న అపోహలతో చెరకును దూరం పెడుతోంది. ఈ భయాలకు శాస్త్రీయ ఆధారాలేమీ లేవని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ప్రకాష్ మూర్తి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పంచుకున్న ఓ వీడియోలో చెరకు ఆరోగ్య ప్రయోజనాలపై కీలక విషయాలు వెల్లడించారు. చెరకు అనేది నిజంగా ఒక పోషకాల గని అని ఆయన వివరించారు.
చెరకులో ఉన్న పోషకాలు
చెరకులో ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, పొటాషియం వంటి అనేక మినరల్స్ సహజంగా లభిస్తాయి. ఇవన్నీ శరీరానికి అవసరమైన మూలకాలు కావడం విశేషం.
కాలేయానికి రక్షణ కవచం
ఆయుర్వేదంలో చెరకును కామెర్లు, హెపటైటిస్ వంటి కాలేయ సంబంధిత సమస్యలకు ఉపయోగకరమైన ఆహారంగా సూచిస్తారు. 2025లో పెకింగ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, చెరకులో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆల్కహాల్ లేదా విషపదార్థాల వల్ల దెబ్బతిన్న కాలేయ కణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడైంది. కాలేయాన్ని శుభ్రపరచడంలో చెరకు సహాయకారిగా పనిచేస్తుంది.
చెరకు తింటే జలుబు, జ్వరం వస్తాయా?
చెరకు తింటే జ్వరం వస్తుందన్నది పూర్తిగా అపోహ మాత్రమే అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జలుబు, జ్వరాలు సాధారణంగా వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తాయి తప్ప చెరకు కారణంగా కాదు. కొందరికి చెరకు నమిలిన వెంటనే గొంతులో స్వల్ప అసౌకర్యం అనిపించినా, అది కొద్దిసేపటికే సహజంగా తగ్గిపోతుంది.
నోటి ఆరోగ్యం – దంతాలకు బలం
చెరకు గట్టిగా ఉంటుందనే కారణంతో చాలామంది తినడానికి వెనుకాడుతారు. కానీ డాక్టర్ ప్రకాష్ మూర్తి చెప్పిన ప్రకారం, చెరకును నమిలి తినడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్ దంతాలను, చిగుళ్లను దృఢంగా మారుస్తాయి. అంతేకాదు, నమలడం అనేది దంతాలకు ఒక మంచి వ్యాయామంలా పనిచేస్తుంది.
మలబద్ధకానికి సహజ పరిష్కారం
పండుగలు, వేడుకల సమయంలో పిండివంటలు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం రావడం సాధారణం. చెరకులో ఉండే సహజ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు చెరకును నమిలి తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
మూత్ర సంబంధిత సమస్యలకు చెరకు ఔషధం
మూత్ర విసర్జన సమయంలో మంట, ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి చెరకు ఎంతో ఉపయుక్తం. ఇందులో ఉండే డైయూరెటిక్ లక్షణాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరచి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.
చెరకు రసం కంటే గడనే మంచిది
చెరకు రసం తాగడం కంటే, గడను పళ్లతో నమిలి తినడమే ఆరోగ్యానికి మరింత శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, చెరకులోని పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి.
Disclaimer
ఈ వ్యాసంలో అందించిన సమాచారం సాధారణ అవగాహన మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోండి.



