India Under-18 Soft Tennis Team: యువ క్రీడాకారుడు రేవంత్‌కు చావలి సునీల్ రూ.25 వేల ప్రోత్సాహకం

అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్న యువ క్రీడాకారుడిని ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ అభినందనలు తెలిపారు. ఇండియా అండర్-18 సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ఎంపికైన యువ క్రీడాకారుడు రేవంత్‌కు శుక్రవారం రూ.25,000 నగదు ప్రోత్సాహకంగా అందజేశారు. మంగళగిరిలోని తన చాంబర్‌లో రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ ఈ నగదును రేవంత్‌కు అందించారు.

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన హోంగార్డు ముత్యాల తిరుమలరావు కుమారుడైన రేవంత్, సాఫ్ట్ టెన్నిస్‌లో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తున్న యువ క్రీడాకారుడు. పేద కుటుంబ నేపథ్యానికి చెందిన రేవంత్, ఎలాంటి ప్రత్యేక సహాయం లేకుండానే కఠిన సాధనతో ఈ స్థాయికి ఎదగడం విశేషం. తన క్రీడా నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం రేవంత్‌కు గర్వకారణమని చావలి సునీల్ పేర్కొన్నారు.

అండర్-18 జాతీయ జట్టులో చోటు దక్కడం ఎంతో అదృష్టమని, ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పేదరికం అడ్డుకాదని ఆయన అన్నారు. లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ వేదికపై మెరుగైన ప్రదర్శనతో విజయోత్సాహంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ రేవంత్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఐ కొలేంటి విక్టర్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సింహాద్రి నాయుడు తదితరులు పాల్గొని రేవంత్‌ను అభినందించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి