చంద్రబాబు నాయుడి పర్యటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం పర్యటన కోసం బయలుదేరారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
హెలికాప్టర్ ల్యాండింగ్ అనంతరం, చంద్రబాబు ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాళ్లపూడి మండలం మలకపల్లికి వెళ్లి, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గ్రామానికి చెందిన చర్మకారుడు సనమండ్ర పోశిబాబు ఇంటికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు, ఆయన్ను కలిసి పింఛన్‌ను తన చేతుల మీదుగా అందించారు. అనంతరం బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమంలో భాగంగా ప్రజావేదికలో పాల్గొన్నారు.
ఇక, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఆయన జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విద్యార్థి నాయకుడిగా ప్రారంభించిన ఆయన ప్రయాణం దేశ అత్యున్నత Constitutional పదవికి దారితీసింది. ప్రజాసేవే ఆయన లక్ష్యం’’ అని ట్వీట్ ద్వారా కొనియాడారు.
అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీ.ఆర్. నాయుడుకి కూడా చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శ్రీవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో నిండైన జీవితం గడపాలని’’ కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.