UP Crime: కేర్‌టేకర్ల దారుణం – వృద్ధుడు మృతి, దివ్యాంగురాలైన కుమార్తె పరిస్థితి విషమం

ఇది చదివితే హృదయం కలిచివేస్తుంది… సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే అమానుష ఘటన ఇది. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ దారుణం, మానవత్వం ఎక్కడికో జారిపోయిందని చెబుతోంది.

రైల్వే శాఖలో సీనియర్ క్లర్క్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఓ వృద్ధుడు, ఆయన మానసిక వికలాంగురాలైన కుమార్తెను చూసుకోవాల్సిన కేర్‌టేకర్లే రాక్షసులుగా మారారు. ఐదేళ్ల పాటు వారిద్దరినీ బందీలుగా ఉంచి, ఆకలితో, చిత్రహింసలతో నరకం చూపించారు. ఈ అమానుషత్వం చివరకు ఆ వృద్ధుడి ప్రాణాలు తీసింది. ఆయన కుమార్తె ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

ఓంప్రకాష్ సింగ్ రాథోడ్ (70) రైల్వేలో సీనియర్ క్లర్క్‌గా పనిచేసి రిటైరయ్యారు. 2016లో భార్య మరణించిన తర్వాత, తన 27 ఏళ్ల మానసిక వికలాంగురాలైన కుమార్తె రష్మితో కలిసి జీవిస్తున్నారు. కుమార్తె సంరక్షణ కోసం కుటుంబ సభ్యులు రామ్ ప్రకాష్ కుష్వాహా, అతని భార్య రమాదేవిని కేర్‌టేకర్లుగా నియమించారు. కానీ వారు నమ్మకాన్ని ద్రోహంగా మార్చారు.

ఈ దంపతులు తండ్రి–కుమార్తెను ఇంటి కింద గదిలో బంధించి, తామేమో పై అంతస్తులో విలాసవంతంగా జీవించసాగారు. బంధువులు ఎవరైనా కలవడానికి వస్తే, “ఓంప్రకాష్ ఎవరినీ కలవడానికి ఇష్టపడటం లేదు” అంటూ అబద్ధాలు చెప్పి పంపించేవారు.

సోమవారం ఓంప్రకాష్ మృతి చెందినట్లు సమాచారం అందడంతో బంధువులు ఇంటికి చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం వారిని షాక్‌కు గురిచేసింది. ఎప్పుడూ సూటు, టైతో హుందాగా కనిపించే ఓంప్రకాష్ శరీరం పూర్తిగా క్షీణించి, ఎముకల గూడులా మారిపోయింది. చీకటి గదిలో వివస్త్రగా పడి ఉన్న కుమార్తె రష్మి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఆకలి, నిర్లక్ష్యం కారణంగా 27 ఏళ్ల యువతి 80 ఏళ్ల వృద్ధురాలిలా అస్థిపంజరంలా మారిందని బంధువు పుష్పా సింగ్ కన్నీళ్లతో వాపోయారు.

ఓంప్రకాష్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. రష్మిని ప్రస్తుతం బంధువులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు.

నమ్మిన వారే ఈ స్థాయిలో దారుణంగా ప్రవర్తించి ఒకరి ప్రాణాలు తీసి, మరో జీవితాన్ని నరకంగా మార్చారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ అమానుషానికి పాల్పడ్డ నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి