దేశంలో జీవన ప్రమాణాలు పెరుగుతున్న కొద్దీ టూవీలర్ల నుంచి కార్ల వైపు అడుగులు వేస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. బ్యాంకుల తేలికైన లోన్ సదుపాయాలతో మధ్యతరగతి కుటుంబాలూ ఇప్పుడు సులభంగా కారు కలను నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా రూ.10 లక్షలకు పైబడిన మిడ్‌సెగ్మెంట్, లగ్జరీ మోడళ్ల కొనుగోళ్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. అయితే ఇలాంటి వారు ఒక ముఖ్యమైన ప్రయోజనాన్ని చేతులారా కోల్పోతున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రఖ్యాత ఇన్వెస్టర్ ఆశిష్ కుమార్ మెహర్ తన ఎక్స్ (Twitter) పోస్టులో కీలక విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. రూ.10 లక్షల కంటే అధిక విలువైన కారు కొన్న ప్రతీ కొనుగోలుదారుడి నుంచి డీలర్లు 1% TCS (Tax Collected at Source) వసూలు చేస్తారు. ఈ సొమ్ము ప్రభుత్వం పేరుతో కట్ చేసినప్పటికీ, ఇది పూర్తిగా తిరిగి రీఫండ్ రూపంలో వస్తుంది. కానీ ఈ విషయాన్ని చాలా మంది కొనుగోలుదారులు తెలియకపోవడం వల్ల లక్షల్లో కార్లు కొనైనా, వేలల్లో తమ హక్కు డబ్బును వదిలేస్తున్నారని ఆయన తెలిపారు.
ఎలా తిరిగి తీసుకోవాలి?
- ఉదాహరణకు రూ.10 లక్షల కార్ కొనుగోలుపై రూ.10,000 TCS కట్ చేస్తారు.
- ఈ మొత్తం 100% రీఫండ్ చేయించుకోవచ్చు.
- డీలర్ నుంచి Form 27D తప్పనిసరిగా తీసుకోవాలి.
- టాక్స్ ఫైలింగ్ సమయంలో Form 26AS లో ఈ TCS ఎంట్రీ కనిపిస్తుంది.
- అప్పుడేసి ఈ మొత్తాన్ని రీఫండ్‌గా క్లెయిమ్ చేయవచ్చు లేదా చెల్లించాల్సిన పన్నులో సర్దుబాటు చేసుకోవచ్చు.
- పాన్‌కు ఇది నేరుగా లింక్ అయ్యి ఉండటం వల్ల, ఈ రీఫండ్ కొనుగోలుదారుడికే వస్తుంది.
నిపుణులు చెబుతున్నదేమిటంటే — కార్ విలువ పెరుగుతున్న కొద్దీ కట్ అయ్యే TCS మొత్తం కూడా పెరుగుతుంది. అంటే రూ.20 లక్షల కార్‌పై రూ.20,000, రూ.40 లక్షల కార్‌పై రూ.40,000 వరకు కూడా రీఫండ్ పొందే వీలుంది.
ఎందుకు ముఖ్యం?
దేశంలో కార్ల కొనుగోలు వార్షికంగా పెరుగుతున్న వేళ, తమ హక్కుల గురించి ప్రతి కొనుగోలుదారుడూ తెలుసుకోవడం చాలా అవసరం. ఉచితంగా దక్కే డబ్బును వదిలేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు. చిన్న సమాచారం కూడా పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుందని మెహర్ సూచించారు.
మీరు లేదా మీ పరిచయస్థుల్లో ఎవరు రూ.10 లక్షలకు పైబడిన కారు కొనుగోలు చేసి ఉంటే — వెంటనే Form 27D తీసుకుని, ఈ రీఫండ్‌ని క్లెయిమ్ చేసుకోవడం మరవద్దు!



