బుమ్రా ఘనత.. సేనా దేశాల్లో రికార్డు వికెట్లతో చరిత్రలోకి!

భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి టాప్ దేశాల్లో టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియన్ బౌలర్‌గా రికార్డులు తిరగరాశాడు. మొత్తం 60 ఇన్నింగ్స్‌ల్లో బుమ్రా 148 వికెట్లు తీసి, పాకిస్థాన్ దిగ్గజం వసీమ్ అక్రమ్ (146 వికెట్లు) రికార్డును అధిగమించాడు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా ఈ మైలురాయిని బుమ్రా అధిగమించాడు. రెండో రోజు ఆటలో మూడు కీలక వికెట్లు తీసిన బుమ్రా, టెస్టుల్లో తన ప్రభావాన్ని మరోసారి చూపించాడు. ఈ మ్యాచ్‌కు ముందు బుమ్రా ఖాతాలో 145 వికెట్లు ఉండగా, తాజాగా ఆ సంఖ్య 148కి చేరింది.

సేనా దేశాల్లో ఆసియన్ బౌలర్ల వికెట్ల గణాంకాలు:

  • జస్‌ప్రీత్ బుమ్రా – 60 ఇన్నింగ్స్‌లు – 148 వికెట్లు
  • వసీమ్ అక్రమ్ – 55 ఇన్నింగ్స్‌లు – 146 వికెట్లు
  • అనిల్ కుంబ్లే – 67 ఇన్నింగ్స్‌లు – 141 వికెట్లు
  • ఇషాంత్ శర్మ – 71 ఇన్నింగ్స్‌లు – 130 వికెట్లు
  • మహమ్మద్ షమీ – 63 ఇన్నింగ్స్‌లు – 123 వికెట్లు

దేశాలవారీగా బుమ్రా ఘనత:

  • ఆస్ట్రేలియాపై 12 మ్యాచ్‌లు – 64 వికెట్లు
  • ఇంగ్లాండ్పై 10 మ్యాచ్‌లు – 39 వికెట్లు
  • దక్షిణాఫ్రికాపై 8 మ్యాచ్‌లు – 38 వికెట్లు
  • న్యూజిలాండ్పై 2 మ్యాచ్‌లు – 6 వికెట్లు

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్టులో బుమ్రా మినహా ఇతర బౌలర్లు వికెట్ల రూపంలో పెద్దగా మద్దతు అందించలేకపోయారు. మరోవైపు, టీమిండియా బ్యాటింగ్‌లో పంత్ శతకం సాధించినప్పటికీ, జట్టు 471 పరుగులకు ఆలౌట్ అయింది.

ఇక మరో విశేషం ఏమిటంటే… సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్‌కు ఈ టెస్టులో అవకాశం దక్కింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో అతడు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి