ప్రేమ వ్యవహారం నేపథ్యంలో మరో అమాయక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనం రేపుతోంది. తమ కూతురితో ప్రేమలో ఉన్నాడన్న కారణంతో ఒక బీటెక్ విద్యార్థిని యువతి తల్లిదండ్రులే దారుణంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పెళ్లి గురించి మాట్లాడుకుందంటూ ఇంటికి పిలిపించుకొని నరమేధం జరిపారనే అనుమానాలు యువకుడి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ సృజన లక్ష్మీ నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు ప్రాంతానికి చెందిన జ్యోతి శ్రవణ్ సాయి అలియాస్ శివ (20) కుత్బుల్లాపూర్‌లో అద్దె గదిలో ఉంటూ మైసమ్మగూడలోని సెయింట్ పీటర్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో సంగారెడ్డి బీరంగూడ ఇసుకబావికి చెందిన శ్రీజ (19)తో అతను ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పరస్పరం ప్రేమించుకుని, ప్రేమ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.
అయితే ఈ సంబంధాన్ని యువతి తల్లిదండ్రులు అస్సలు అంగీకరించలేదు. పలుమార్లు సాయిని హెచ్చరించినప్పటికీ వారిరువురి ప్రేమ బంధం కొనసాగింది. చివరుకి పెళ్లి విషయంపై మాట్లాడుకుంటామని నమ్మించి, సాయిని తమ ఇంటికి పిలిపించుకున్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి అతడిపై ఒక్కసారిగా దాడి చేసినట్లు సమాచారం. బ్యాటుతో క్రూరంగా కొట్టి అతడ్ని అక్కడికక్కడే హతమార్చినట్లు ప్రాథమిక సమాచారం.
సాయి మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసిన అమీన్‌పూర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగు చూడాల్సి ఉంది.



