బ్రెజిల్లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. డాక్టర్లు కూడా నమ్మలేని విధంగా ఓ శిశువు జననం వైద్యరంగంలో వింతగా మారింది. గోయియాస్ రాష్ట్రంలోని నెరోపోలిస్ పట్టణంలో ఉన్న సాగ్రాడో కొరాకో డి జీసస్ హాస్పిటల్లో క్వీడీ అరౌజో డి ఒలివెరా అనే మహిళ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ శిశువు పుట్టగానే తన చిన్నపాటి పిడికిలిలో రాగి “టి” (Copper-T) పట్టుకున్నాడు. ఇది సాధారణ రాగి వస్తువు కాదు, గర్భనిరోధక పరికరమైన ఇంట్రాటూరైన్ డివైస్ (IUD). దీన్ని సాధారణంగా “కాపర్ T” లేదా “కాపర్ కాయిల్” అని పిలుస్తారు. మహిళలు గర్భం దాల్చకుండా నిరోధించడానికి ఈ పరికరాన్ని గర్భాశయంలో అమర్చుతారు.
వైద్య శాస్త్రం ప్రకారం, IUD అమర్చిన మహిళలు 99 శాతం గర్భం దాల్చే అవకాశమే ఉండదు. అయితే, ఈ సందర్భంలో అద్భుతం జరిగింది. కాపర్-T ఉన్నప్పటికీ తల్లి గర్భంలో శిశువు పెరిగి ఆరోగ్యంగా పుట్టడమే కాకుండా, తల్లి గర్భధారణను ఆపాలని ఉద్దేశించిన అదే పరికరాన్ని తన చేతిలో పట్టుకొని వెలిసాడు.
వివరాల ప్రకారం, ఒలివెరా గత రెండు సంవత్సరాలుగా కాపర్ T ఉపయోగిస్తోంది. సాధారణ వైద్యపరీక్షలోనే ఆమె గర్భవతి అని తెలిసింది. ఆ సమయంలో వైద్యులు కాపర్-Tను తొలగించాల్సిన అవసరం లేదని తెలిపారు. దాంతో ఆ పరికరం గర్భాశయంలోనే కొనసాగింది. కానీ ప్రసవం జరిగిన రోజున ఆ పరికరం శిశువుతో పాటు బయటకు వచ్చి, అతని పిడికిట్లో కనిపించడం వైద్యులను కూడా ఆశ్చర్యపరిచింది.
ఈ సంఘటనను డాక్టర్లు ఒక అరుదైన వైద్య అద్భుతంగా పరిగణిస్తున్నారు. వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా, సహజసిద్ధమైన కొన్ని విషయాలు ఇప్పటికీ మనసును ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.



