ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ సుమారు ఐదున్నర గంటలు రాష్ట్రంలో గడిపారు. ఉదయం 8:15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను పొగమంచు కారణంగా విమానం కొంతసేపు చక్కర్లు కొట్టినప్పటికీ సమయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రులు నారా లోకేష్, అనిత, సత్యకుమార్ యాదవ్‌లు గేట్స్‌కు ఘనంగా స్వాగతం పలికారు.
అక్కడి నుంచి నేరుగా ఏపీ సచివాలయానికి చేరుకున్న గేట్స్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులను గేట్స్‌కు పరిచయం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న డేటాబేస్ వ్యవస్థలు, సాంకేతికత, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ అంశాలపై సీఎం వివరించారు. ఈ సందర్భంగా “మై ఫ్రెండ్, హౌ ఆర్ యూ?” అంటూ గేట్స్, చంద్రబాబును ఆత్మీయంగా పలకరించారు.
మంత్రులతో కొద్దిసేపు సమావేశమైన గేట్స్ వివిధ అంశాలపై చర్చించారు. సీఎం చంద్రబాబు తనకు పాత మిత్రుడని పేర్కొన్న గేట్స్, దేశంలో సాంకేతిక విప్లవం కీలక దశలో ఉందన్నారు. కుప్పంలో అమలు చేస్తున్న ఆరోగ్య రంగానికి సంబంధించిన సంజీవని ప్రాజెక్టును ప్రశంసించారు. ఆరోగ్యం, వ్యవసాయం రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
సచివాలయంలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబుతో కలిసి ఒకే వాహనంలో ఉండవల్లి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరారు గేట్స్. అక్కడ సహజ సాగు ఉత్పత్తులను పరిశీలించడంతో పాటు, రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏఐ ఆధారిత సాంకేతిక విధానాలపై అధికారులు వివరించారు. డ్రోన్ల ద్వారా పంటల్లో చీడపీడల నియంత్రణను గేట్స్ స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. మహిళా రైతులు సీఎంకు, గేట్స్‌కు స్వాగతం పలికి, తాము సిద్ధం చేసిన స్థానిక వంటకాలను గేట్స్‌కు వడ్డించారు.
తర్వాత విజయవాడలో జరిగిన స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న గేట్స్, మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి బయలుదేరారు. మొత్తం మీద సుమారు ఐదున్నర గంటలకు పైగా బిల్ గేట్స్ ఏపీ పర్యటన కొనసాగింది.



