బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమి విస్తృత ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులోనే సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు దిశగా నమ్మకంగా అడుగులు వేస్తోంది. ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ సారథ్యంలోని మహాఘటబంధన్‌ను భారీ తేడాతో వెనక్కు నెట్టిన పరిస్థితి స్పష్టమవుతోంది.
తాజా లెక్కల ప్రకారం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 122 మేజిక్ ఫిగర్‌ను ఎన్డీఏ ఇప్పటికే దాటేసింది. ప్రస్తుతం కూటమి 162 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, మహాఘటబంధన్ 77 స్థానాలకే పరిమితమైంది. తొలి ప్రయత్నంలోనే ఎన్నికల బరిలోకి దిగిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన ‘జన్ సురాజ్’ పార్టీ ద్వారా రెండు స్థానాల్లో ఆధిక్యం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఫలితాల ప్రవాహం దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తోంది. ఎన్డీటీవీ విడుదల చేసిన ‘పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్’లో ఎన్డీఏకి 146 స్థానాలు, మహాఘటబంధన్‌కు 92 స్థానాలు వస్తాయని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఫలితాలు ఆ అంచనాలకు బలమైన మద్దతు ఇస్తున్నాయి.
ఎన్డీఏ కూటమిలో జేడీయూ, బీజేపీతో పాటు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (లోక్ జనశక్తి పార్టీ–రామ్ విలాస్), మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ (హిందుస్తానీ అవామ్ మోర్చా), ఉపేంద్ర కుష్వాహా (రాష్ట్రీయ లోక్ మోర్చా) తదితర పార్టీలు భాగస్వాములుగా ఉన్నారు.
ఓటు ధోరణులపై యాక్సిస్ మై ఇండియా సర్వే చేసిన విశ్లేషణ ప్రకారం — మహిళా ఓటర్లు భారీగా నితీశ్ కుమార్ వైపే మొగ్గు చూపగా, యాదవ–ముస్లిం ఓటర్లు మహాఘటబంధన్‌కు గట్టి మద్దతు ప్రకటించినట్లు వెల్లడైంది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో బీహార్‌లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. గట్టి ప్రచార పోరాటం అనంతరం వెలువడుతున్న ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించే కీలక ఘట్టంగా నిలవనున్నాయి.



