భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ప్రణాళికలు, ప్రాథమిక పనులు 2014–19 మధ్య ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో తాజాగా నిర్వహించిన వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా పూర్తికావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర విమానయాన రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి గణనీయమైన ఊతం లభిస్తుందని, ప్రాంతీయ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. అలాగే, వచ్చే జూన్ నెల నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.
భోగాపురం విమానాశ్రయంపై జగన్ వ్యాఖ్యలు
విశాఖపట్నం సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ కావడంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయి అని, ‘విజన్ వైజాగ్’ లక్ష్య సాధన దిశగా వేసిన కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు.
ఈ ప్రాజెక్టు ప్రస్తుత దశకు చేరుకోవడంలో తమ ప్రభుత్వ హయాంలో వేసిన పటిష్ఠమైన పునాదే ప్రధాన కారణమని జగన్ పేర్కొన్నారు. తమ పాలనా కాలంలో ఈ ప్రాజెక్టుకు వేగవంతమైన అనుమతులు తీసుకొచ్చామని తెలిపారు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కోసం సుమారు రూ.960 కోట్లను వెచ్చించి, ప్రాజెక్టును ముందుకు నడిపించామని వివరించారు. ప్రధాన నిర్మాణ పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయ్యిందని, ఆ సమయంలో చేసిన కృషి వల్లే నేడు ఈ కీలక దశను చేరుకోగలిగామని ఆయన స్పష్టం చేశారు.



