పలు నౌకలు, విమానాలు అంతుచిక్కని విధంగా అదృశ్యమయ్యాయనే కథనాలతో ప్రపంచవ్యాప్తంగా రహస్యాలకు ప్రతీకగా మారిన బెర్ముడా ట్రయాంగిల్ మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది. ఈ ప్రాంతం కింద శాస్త్రవేత్తలు భూమి లోపల దాగి ఉన్న ఒక భారీ, అసాధారణ నిర్మాణాన్ని గుర్తించారు. భూమి ఉపరితలం కింద సుమారు 20 కిలోమీటర్ల (దాదాపు 12.4 మైళ్లు) మందంతో విస్తరించి ఉన్న ఈ ప్రత్యేకమైన రాతి పొర, భూమిపై ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించని విధంగా ఉండటంతో పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఫ్లోరిడా, ప్యూర్టోరికో, బెర్ముడా మధ్య విస్తరించి ఉన్న అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతంలో ఈ కీలక ఆవిష్కరణ జరిగింది. కార్నెగీ సైన్స్ సంస్థతో పాటు యేల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కలిసి భూకంపాల సమయంలో విడుదలైన సీస్మిక్ తరంగాల డేటాను లోతుగా విశ్లేషించి ఈ అధ్యయనాన్ని చేపట్టారు. సాధారణంగా భూమి నిర్మాణంలో పైభాగంలో క్రస్ట్ ఉండగా, దాని కింద నేరుగా మాంటిల్ పొర ఉంటుంది. కానీ బెర్ముడా ట్రయాంగిల్ కింద మాత్రం క్రస్ట్, మాంటిల్ మధ్య అసాధారణంగా తక్కువ సాంద్రత కలిగిన ఒక భారీ రాతి పొర ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.
ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త విలియం ఫ్రేజర్ ప్రకారం, భూమి లోపలి నిర్మాణంపై ఇప్పటివరకు ఉన్న శాస్త్రీయ అవగాహనకు ఇది భిన్నమైన అంశం. ఈ వివరాలను ప్రతిష్టాత్మక శాస్త్రీయ జర్నల్ ‘జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్’లో ప్రచురించారు. లక్షల సంవత్సరాల క్రితం ‘ప్యాంజియా’ అనే మహాఖండం విడిపోయే సమయంలో చోటుచేసుకున్న తీవ్ర అగ్నిపర్వత కార్యకలాపాల అవశేషాలే ఈ రాతి పొర కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
అంతేకాదు, బెర్ముడా ప్రాంతంలో సముద్ర మట్టం చుట్టుపక్కల అట్లాంటిక్ ప్రాంతాల కంటే సుమారు 500 మీటర్లు ఎత్తుగా ఉండటానికి కూడా ఈ నిర్మాణమే ప్రధాన కారణంగా ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ అగ్నిపర్వత ద్వీపాలు ఎలా ఏర్పడతాయన్న దానిపై ఇప్పటివరకు ఉన్న సిద్ధాంతాలకు సవాల్‌గా మారుతోంది.
బెర్ముడా ట్రయాంగిల్ వంటి ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా భూమి లోపల జరిగే ప్రక్రియలపై మరింత స్పష్టమైన అవగాహన పొందవచ్చని ఫ్రేజర్ తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచంలోని ఇతర దీవులు, సముద్ర ప్రాంతాల కింద కూడా ఇలాంటి రహస్య నిర్మాణాలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేపట్టనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.



