మన రోజువారీ జీవితంలో ఇల్లు, ఆఫీసులు, షాపింగ్ మాల్స్, హోటల్స్—ఏదైనా ప్రదేశంలో టాయిలెట్, బాత్రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్ వంటి పదాలు తరచూ వినిపిస్తాయి. చాలా మంది వీటన్నింటినీ ఒకే అర్థంలో వాడతారు. కానీ వాస్తవానికి, ఈ నాలుగు పదాలకి వేర్వేరు అర్థాలు, ఉపయోగాలు ఉన్నాయి. వాటి సౌకర్యాలు, నిర్మాణ విధానం కూడా భిన్నంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉపయోగించే ఈ ప్రదేశాల మధ్య తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాత్రూమ్ అంటే ఏమిటి?
బాత్రూమ్ అనేది ప్రధానంగా స్నానం కోసం ఉన్న గది. ఇక్కడ షవర్, బాత్‌టబ్, వాష్ బేసిన్, సబ్బులు, బకెట్ వంటి స్నాన సౌకర్యాలు ఉంటాయి. సాధారణంగా ఇది బెడ్‌రూమ్ లేదా లివింగ్ రూమ్‌కు అనుబంధంగా ఉంటుంది. చాలా ఇళ్లలో బాత్రూమ్‌లోనే టాయిలెట్ సీటు కూడా ఉంటుంది. అందువల్ల “బాత్రూమ్‌కు వెళ్లి వచ్చాను” అని చెప్పడం సాధారణం. కానీ, స్నానం కోసం ఏర్పాట్లు ఉన్న గదిని మాత్రమే బాత్రూమ్ అని పిలవడం సరైనది.
వాష్‌రూమ్ – రెస్ట్‌రూమ్
వీటిద్దరూ మూత్ర విసర్జన, మల విసర్జన కోసం ఉపయోగించే గదులను సూచిస్తాయి. అయితే, రెస్ట్‌రూమ్ అనేది అమెరికన్ పదం. వాష్‌రూమ్‌లో టాయిలెట్ సీటు, వాష్ బేసిన్, అద్దం, కొన్నిసార్లు బట్టలు మార్చుకునే కొద్దిపాటి స్థలం ఉంటాయి. ఇక్కడ షవర్ లేదా బాత్‌టబ్ ఉండదు. బహిరంగ ప్రదేశాల్లో—స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు, మాల్స్, ఆసుపత్రులు—వీటిని పురుషులు, మహిళలకు విడిగా ఏర్పాటు చేస్తారు.
టాయిలెట్
టాయిలెట్ అత్యంత ప్రాథమికమైన అవసరాల కోసం మాత్రమే ఉంటుంది. ఇక్కడ కేవలం కమోడ్ ఉంటుంది. కొన్ని చోట్ల చేతులు కడుక్కోవడానికి బేసిన్ ఉంటుంది, మరికొందరికి అది కూడా ఉండకపోవచ్చు. స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం వంటి సౌకర్యాలు టాయిలెట్‌లో ఉండవు. రోడ్డు పక్కన, ప్రయాణ సమయంలో కనిపించే వసతులు ఎక్కువగా టాయిలెట్లే అవుతాయి.
సారాంశం
ఈ నాలుగు పదాలు ఒకే రకమైన అవసరాన్ని తీర్చినప్పటికీ, వాటి సౌకర్యాలు, నిర్మాణ విధానం, ఉపయోగాల పరిమితులు స్పష్టంగా వేరు. ఇకపై బాత్రూమ్, టాయిలెట్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్‌లను సరైన సందర్భంలో వాడి, వాటి మధ్య తేడాను గుర్తించగలరు.



