బాపట్లలో భయానక రోడ్డు ప్రమాదం – ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి

బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట సమీపంలో కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో ఈ విషాదం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే — కర్లపాలెం గ్రామానికి చెందిన బేతాళం బలరామరాజు (65), ఆయన భార్య బేతాళం లక్ష్మి (60), గాదిరాజు పుష్పవతి (60), ముదుచారి శ్రీనివాసరాజు (54) నిన్న రాత్రి బాపట్లలో జరిగిన ఎమ్మెల్యే కుమారుడి సంగీత్ కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుక ముగిశాక అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటి గంట సమయంలో కారు ద్వారా తిరుగు పయనం అయ్యారు.

సత్యవతిపేట వద్దకు చేరుకున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ వారి కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు నుజ్జునుజ్జయింది. బలరామరాజు, లక్ష్మి, పుష్పవతి, శ్రీనివాసరాజు అక్కడికక్కడే మృతి చెందారు. అదే వాహనంలో ఉన్న 13, 11 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన చిన్నారులను తక్షణమే ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం ప్రస్తుతం వారిద్దరికీ ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవ్వడంతో కర్లపాలెం గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి