టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు చేపట్టిన సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. సుమారు 20 రోజులుగా సాగుతున్న ఈ యాత్రలో తాజాగా హీరో విశ్వక్ సేన్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
షాద్‌నగర్ నుంచి ప్రారంభమైన ఈ సంకల్ప యాత్ర ప్రస్తుతం అలిపిరి వరకు చేరుకుంది. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైతే తిరుమలకు పాదయాత్ర చేస్తానని గతంలో మొక్కుకున్న బండ్ల గణేశ్, ఆ మొక్కును నెరవేర్చుకునే క్రమంలో ఈ యాత్ర చేపట్టారు.
ఈ యాత్రలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. తాజాగా హీరో విశ్వక్ సేన్ బండ్ల గణేశ్‌తో కలిసి కొద్దిదూరం పాదయాత్రలో నడిచారు. దీనికి సంబంధించిన ఫొటోలను బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
“నా సంకల్ప యాత్రలో నాతో అడుగులు వేసిన తమ్ముడు విశ్వక్ సేన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు” అంటూ బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఫంకీ సినిమా ప్రమోషన్లలో భాగంగా తిరుపతిలో ఉన్న విశ్వక్ సేన్, ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్నారు.



