భారతదేశం త్వరలో మరో ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. ఆధ్యాత్మికతకు, ఆధునిక సాంకేతికతకు ప్రతీకగా నిలుస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్‌లో భారతదేశపు తొలి 132 మీటర్ల కేబుల్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జి — ‘బజరంగ్ సేతు’ రూపుదిద్దుకుంది. రూ.70 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ అద్భుత వంతెన దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో రెండవది కావడం విశేషం.
కేదార్‌నాథ్ ఆలయ రూపంలో ట్విన్ టవర్స్
ఈ వంతెన ప్రధాన ఆకర్షణగా నిలిచే ట్విన్ టవర్స్‌ను కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడి నమూనాలో రూపొందించారు. ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక సారాన్ని ప్రతిబింబించేలా ఒక చివరలో కేదార్‌నాథ్ స్వామి విగ్రహం, మరొక చివరలో బద్రీనాథ్ స్వామి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ రూపకల్పన రిషికేష్ పవిత్రతను మరింతగా ప్రతిఫలించేలా ఉంది.
గంగానదిపై అద్భుత దృశ్యాలు
గంగానదిపై నిర్మితమైన ఈ వంతెన పైనుంచి చూసే దృశ్యం పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేయనుంది. పారదర్శక అద్దాలతో రూపొందించిన 65–66 మిల్లీమీటర్ల మందం గల గాజు పలకల ఫ్లోర్‌పై నడుస్తూ, నదిపైనే నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. 57–70 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్లాస్ ఫ్లోర్ భక్తులు, పర్యాటకులకు కొత్త అనుభవాన్ని అందిస్తుంది.
రవాణా, పర్యాటకం రెండింటికీ ఉపయోగం
‘బజరంగ్ సేతు’ కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు. స్థానిక ప్రజల రవాణా అవసరాలకు కూడా ఉపయుక్తంగా రూపుదిద్దుకుంది. మధ్య భాగంలో టూవీలర్లు, తేలికపాటి ఫోర్‌వీలర్లు ప్రయాణించడానికి అనుకూలంగా డిజైన్ చేశారు. దీని వల్ల గంగానదికి ఇరువైపుల ఉన్న ప్రాంతాల మధ్య అనుసంధానం మెరుగుపడనుంది.
నిర్మాణ వ్యయంతో అద్భుత ప్రాజెక్ట్
2022లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కి రూ.68 నుండి రూ.70 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఆధునిక ఇంజినీరింగ్, నాణ్యమైన గ్లాస్ మెటీరియల్‌తో ఈ వంతెన నిర్మాణం దాదాపు పూర్తికి చేరుకుంది. అధికార వర్గాల ప్రకారం 2025 చివరి నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో పాక్షికంగా ప్రారంభించి, 2026 ప్రారంభంలో పూర్తిస్థాయిలో ప్రారంభం చేయనున్నారు.
రిషికేష్‌కి కొత్త గుర్తింపు
బజరంగ్ సేతు అందుబాటులోకి వస్తే రిషికేష్ పర్యాటక, ఆధ్యాత్మిక, సాహస గమ్యస్థానంగా మరింత పేరుపొందనుంది. పరమార్థ నికేతన్ ఆశ్రమం, బీటిల్స్ ఆశ్రమం వంటి ప్రసిద్ధ కేంద్రాలకు ఇది చాలా దగ్గరగా ఉండటంతో పర్యాటకులు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతారని అధికారులు భావిస్తున్నారు. రిషికేష్ ఇప్పటికే “యోగా రాజధాని”గా ప్రసిద్ధి గాంచగా, ఈ గ్లాస్ బ్రిడ్జి ఆ గుర్తింపును మరింత బలోపేతం చేయనుంది.



