బహ్రెయిన్‌లో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన జగిత్యాల జిల్లాలోని కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచెత్తింది. సుమారు పదిహేడేళ్ల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్‌కు వెళ్లిన వ్యక్తి, ఐదేళ్ల క్రితమే మరణించి ఉండగా, ఆ విషయాన్ని ఇప్పుడు మాత్రమే కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని రాంనగర్‌కు చెందిన భారతి–అశోక్ దంపతుల కుమారుడు నరేశ్ చిన్ననాటి నుంచే అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో అతనిని చిన్నమ్మ శ్రీపాద లక్ష్మీ దత్తత తీసుకున్నారు. తరువాత, 2007లో కథలాపూర్ మండలానికి చెందిన యువతితో అతని వివాహం జరిగింది.
ఉపాధి కోసం కొద్ది నెలలకే నరేశ్ బహ్రెయిన్ ప్రయాణమయ్యాడు. మొదట రెండు సంవత్సరాల పాటు కుటుంబసభ్యులతో, బంధువులతో ఫోన్ ద్వారా తరచూ మాట్లాడేవాడు. కానీ తర్వాత ఒక్కసారిగా సంప్రదింపులు ఆగిపోయాయి. కుటుంబసభ్యులు ఎన్నిసార్లు ఆరా తీసినా ఎక్కడి నుండి సమాచారం రాలేదు. పాస్‌పోర్ట్ గడువు పూర్తయిన తర్వాత ఇంటికి వస్తాడని భావించిన వారు చివరకు నిరీక్షణతోనే అలసిపోయారు.
సంవత్సరాలు గడుస్తున్నా ఆచూకీ దొరకకపోవడంతో నరేశ్ భార్య కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అయినప్పటికీ ఎటువంటి సమాచారం లభించలేదు. అయితే, రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులకు గుండెలు పిండేసే వార్త అందింది — నరేశ్ ఐదేళ్ల క్రితమే మృతి చెందాడని, అతని మృతదేహం బహ్రెయిన్‌లోని ఓ మార్చురీలో భద్రపరచబడి ఉందని అధికారుల ద్వారా తెలిసింది.
తన మరణానికి గల కారణాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. పాస్‌పోర్టు గడువు ముగిసిన తర్వాత కూడా నరేశ్ అక్కడే ఉండిపోయినట్లు సమాచారం. గుర్తింపు లభించకపోవడంతో అతని మృతదేహాన్ని ఇంతకాలం మార్చురీలో ఉంచినట్లు తెలుస్తోంది.
ఇటీవల భారత ఎంబసీ అధికారులు ఆ వివరాలను బహిర్గతం చేయడంతో, ఆ సమాచారము కుటుంబ సభ్యుల చెవికి చేరింది. ప్రస్తుతం నరేశ్ సోదరుడు ఆనంద్, ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ద్వారా “సీఎం ప్రవాసీ ప్రజావాణి” వద్ద ఫిర్యాదు చేసి, అతని మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని కోరాడు.
పదిహేడేళ్ల కిందట మంచి జీవితం కోసం ఎడారి దేశం వైపు బయలుదేరిన నరేశ్ కథ, చివరికి ఒక విషాదాంతంగా మారింది. ఇప్పుడు అతడి స్వదేశానికి రానున్న మృతదేహం కోసం కుటుంబం కంటతడి పెట్టుకుంటోంది.



