తమిళనాడులో అయ్యప్ప భక్తులపై మృత్యు పంజా – ఏపికి చెందిన నలుగురు దుర్మరణం

తిరుగులేని ప్రాణనష్టం… ఒక్కసారిగా కుటుంబాలపై విరిగిన విషాదం… అయ్యప్ప స్వామి దర్శనం చేసి తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులపై మారణహోమం సృష్టించిన భయంకర రోడ్డు ప్రమాదం తమిళనాడులో చోటుచేసుకుంది. ఈరోజు (డిసెంబర్ 6, 2025) తెల్లవారుజామున రామనాథపురం సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం. మరింత విచారకరం ఏమిటంటే—ఇద్దరు వాహనాల్లో ప్రయాణించిన వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే.

వివరాల్లోకి వెళ్తే… శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం వైపుకు బయలుదేరిన అయ్యప్ప భక్తులు రామనాథపురం వద్ద కారును రోడ్డు పక్కన ఆపి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి నేరుగా వారి కారు మీదకు దూసుకెళ్లి ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు కారు తీవ్రంగా ధ్వంసమై, నలుగురు భక్తులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మృతుల్లో ముగ్గురు విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలసకు చెందినవారని, మరో వ్యక్తి గజపతినగరం మండలం మరుపల్లి గ్రామ వాసి అని గుర్తించారు. ఒక్క ఊర్లో ముగ్గురు యువకులు ఇలా ఉదయం ఉదయం మరణించడంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ఇలాంటి విషాదం జరగడం చాలా బాధాకరమని తెలిపారు. ప్రమాదంపై పూర్తివివరాలు సేకరించాలని, మృతదేహాలను త్వరితగతిన కుటుంబాలకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

మృతుల వివరాలు

దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస గ్రామం:

  1. వంగర రామకృష్ణ (51)
  2. మార్పిన అప్పల నాయుడు (33)
  3. మరాడ రాము (50)

గజపతినగరం మండలం మరుపల్లి గ్రామం: 4. బండారు చంద్రారావు

ఈ విషాద వార్త చోటుచేసుకున్న గ్రామాల్లో ఒక్కసారిగా కన్నీటి వాతావరణం నెలకొంది. ఆచారాలు, సంకల్పాలు, నమ్మకాలతో దైవ దర్శనం కోసం బయలుదేరిన వీరు తిరిగి కానరాని లోకాలకు వెళ్లిపోవడం కుటుంబాలను, బంధువులను తల్లడిల్లేలా చేసింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి