ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ‘స్త్రీశక్తి’ పథకాన్ని నేడు ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఈ సౌకర్యం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వర్తిస్తుంది. ప్రయాణానికి ఆధార్, ఓటరు లేదా రేషన్ కార్డు చూపిస్తే కండక్టర్ జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు.
పాస్ ఉన్నవారికి మరో 15 రోజుల తర్వాతే ఫ్రీ బస్ సౌకర్యం
ఇప్పటికే స్టూడెంట్ పాస్‌లు, నెలవారీ లేదా సీజన్ పాస్‌లు తీసుకున్న మహిళలకు ఈ పథకం తక్షణం వర్తించదు.
- పాస్ గడువు పూర్తయ్యాకే వారికి జీరో ఫేర్ టికెట్లు ఇస్తారు.
- అంటే, ఈ నెలాఖరు వరకు కొంతమందికి ఉచిత ప్రయాణం లభించదు.
- సీజన్ పాస్ ఉన్నవారు, ఆ పాస్ ముగిసే వరకు పాత విధానం ప్రకారమే ప్రయాణించాలి.
ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు?
ఈ పథకం తిరుమల–తిరుపతి సప్తగిరి బస్సులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు, అలాగే సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, AC బస్సులు పై వర్తించదు.
భద్రతా చర్యలు & సౌకర్యాలు
ప్రభుత్వం భద్రతా పరంగా పలు చర్యలు చేపట్టింది:
- బస్సుల్లో సీసీ కెమెరాలు
- కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు
- బస్టాండ్లలో మౌలిక సదుపాయాల మెరుగుదల
గుర్తించడానికి స్టిక్కర్లు
మహిళలు సులభంగా గుర్తించేందుకు, ఉచిత ప్రయాణం అందించే బస్సులపై “స్త్రీశక్తి పథకం వర్తిస్తుంది” అనే స్టిక్కర్లు అతికిస్తున్నారు.
- పల్లెవెలుగు (ఆకుపచ్చ) మరియు అల్ట్రా పల్లెవెలుగు బస్సులు సులభంగా గుర్తుపట్టవచ్చు.
- ఎక్స్‌ప్రెస్ బస్సులు రూపంలో ఒకేలా ఉండటంతో, కన్ఫ్యూజన్ నివారించేందుకు స్టిక్కర్లు కీలకం అవుతున్నాయి.
ముఖ్య లక్ష్యం
ఎన్నికల హామీ ప్రకారం, రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక భారం తగ్గించడం, రవాణా సౌలభ్యం కల్పించడం, అలాగే మహిళా సాధికారతను పెంపొందించడం ఈ పథకంలోని ప్రధాన ఉద్దేశ్యం.



