ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించే పథకం అమలులో జాప్యం జరుగుతుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ ముందే ఆమోదించినప్పటికీ ఈ ప్రతిపాదన ఆర్థికశాఖలో పెండింగ్లో ఉండటంపై ఆయన ప్రశ్నించారు.
ముఖ్యంగా చేనేత మగ్గాలకు నెలలో 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు అమలులోకి రాకపోవడంతో సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఆర్థికశాఖ సౌర ప్యానెల్ ప్రతిపాదనను ముందుకు తెచ్చినా, దానికి ముందేసి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. దీంతో ఈ పథకం అమలు ప్రక్రియకు వేగం రావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేల చేనేత మగ్గాలు, 15 వేల మరమగ్గాలు ఉన్నట్లు అంచనా. ఈ పథకం అమలు అయితే ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు భారం తగ్గనుంది. మొత్తం రూ.125 కోట్ల వ్యయం వచ్చే ఈ పథకాన్ని ఆగస్టు 1 నుంచే ప్రారంభించాల్సి ఉన్నా, ఆలస్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలోనే ఈ పథకంపై తుది నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయి.



