ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న 18189 నంబర్ టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర అగ్నిప్రమాదం జరిగింది. విశాఖపట్నం జిల్లా యలమంచలి సమీపంలో తెల్లవారుజామున సుమారు 1:11 నుంచి 1:30 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
మిడ్‌నైట్ సమయంలో ప్యాంట్రీ కారు వెంట ఉన్న B1, M2 ఏసీ బోగీల్లో మొదట దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఆ వెంటనే క్షణాల్లోనే మంటలు భగ్గుమంటూ చెలరేగి వేగంగా వ్యాపించాయి. మంటలను గమనించిన లోకో పైలట్ అప్రమత్తమై వెంటనే రైలును యలమంచలి స్టేషన్‌లో నిలిపివేశారు. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
అయితే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునేలోపే B1, M2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు అత్యంత వేగంగా వ్యాపించడంతో పరిస్థితి అదుపు తప్పిందని అధికారులు తెలిపారు. ప్రాథమికంగా బ్రేకులు అధికంగా వేడెక్కడం వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు.
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం అందింది. విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ B1 ఏసీ బోగీలో చిక్కుకుని తీవ్ర కాలిన గాయాలతో మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
సమాచారం అందిన వెంటనే సీనియర్ రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి గురైన రెండు బోగీలను రైలు నుంచి వేరు చేశారు. ముందుజాగ్రత్తగా అంబులెన్సులను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రాణనష్టం, నష్టాలపై సమగ్ర విచారణ జరుపుతున్నామని దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
యలమంచిలి సమీపంలోని రైల్వే పాయింట్ వద్ద లోకో పైలట్లు తొలుత ఈ ఘటనను గుర్తించినట్లు రైల్వే పోలీసు అధికారులు వెల్లడించారు. బోగీల్లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ప్లాట్‌ఫామ్‌పైకి పరుగులు తీశారు. దట్టమైన పొగ కారణంగా కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
రాత్రివేళ చలిలో వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి యలమంచలి స్టేషన్‌లోనే వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ప్రమాదం వల్ల విశాఖపట్నం–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున 3:30 గంటల తర్వాత దగ్ధమైన బోగీలను పూర్తిగా వేరు చేశారు. అనంతరం ప్రయాణికులను మిగిలిన కోచ్‌లకు తరలించారు.
ఈ క్రమంలో టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ సుమారు నాలుగు గంటల ఆలస్యంగా అనకాపల్లికి చేరుకుంది. ప్రభావిత ప్రయాణికులను మూడు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల ద్వారా సామర్లకోటకు తరలించారు. అక్కడ రైలుకు రెండు కొత్త ఏసీ బోగీలను అమర్చిన అనంతరం రైలు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది.
ఈ ఘటన ప్రభావంతో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించేవరకు విశాఖపట్నం, అనకాపల్లి, తుని స్టేషన్లలో అనేక రైళ్లను నిలిపివేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు దక్షిణమధ్య రైల్వే అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.



