AP TET 2025: నవంబర్ పరీక్ష నోటిఫికేషన్, అర్హత, మరియు 45% మార్కులు తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (AP TET) నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, ప్రస్తుతం సర్వీసులో ఉన్న టీచర్లకు కూడా ఈసారి టెట్‌ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా నోటిఫికేషన్‌ ప్రకారం, ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2011కు ముందు టెట్‌ పరీక్ష లేకుండా నియమించబడిన ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే వచ్చే రెండేళ్లలో టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. అయితే ఐదేళ్లలో పదవీ విరమణ పొందబోయే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినా, పదోన్నతులు పొందాలంటే వారికి టెట్‌ ఉత్తీర్ణత అవసరం.

సుప్రీంకోర్టు సెప్టెంబర్‌ 1న ఇచ్చిన తీర్పు ప్రకారం, 2011కు ముందు నియమితులైన అన్ని టీచర్లు టెట్‌లో ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ నవంబర్‌లో జరగనున్న టెట్‌ పరీక్షలో వారికి కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ అంశంపై అధికారులు సమీక్షలు జరిపి తుది నిర్ణయం తీసుకున్నారు.

నవంబర్‌ టెట్‌లో అర్హత మార్కులు 45 శాతం తప్పనిసరి

బీఈడీ (B.Ed) పూర్తి చేసిన అభ్యర్థులు AP TET రాయాలంటే కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. గతంలో సడలింపు ఇచ్చి 40 శాతం మార్కులు ఉన్నవారికీ అనుమతి ఇచ్చినా, ఈ ఏడాది నవంబర్‌ టెట్‌ నుంచి ఆ సడలింపును రద్దు చేశారు. ఇకపై 45 శాతం మార్కులు లేకుండా టెట్‌ రాయడం సాధ్యం కాదు అని శాఖ స్పష్టం చేసింది.

2011కు ముందు ఎస్జీటీ (SGT) అర్హతలు మరియు 2011 తర్వాత మారిన ప్రమాణాల మధ్య వ్యత్యాసాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కనీస విద్యార్హతల ప్రమాణాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి