ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖకు గర్వకారణం: సూర్య చరిష్మ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్, ఏపీటీ మొదటి మహిళా స్వర్ణ పతకం

ఆంధ్రప్రదేశ్ క్రీడా చరిత్రలో ఇది మరపురాని ఘట్టమని, 87వ యోనెక్స్ సన్‌రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తమిరి సూర్య చరిష్మ ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇదే తొలి జాతీయ స్వర్ణ పతకమని పేర్కొంటూ, ఇదే టోర్నీలో ఏపీ మహిళల జట్టు తొలిసారిగా రజత పతకం గెలవడం కూడా చారిత్రక విజయమని ఆయన అభినందించారు. మహిళా శక్తి, పట్టుదల, సమష్టి కృషికి ఈ విజయం నిలువెత్తు నిదర్శనమని, ఆంధ్ర ఆడబిడ్డలు కొత్త శిఖరాలను అధిరోహిస్తూ భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని లోకేశ్ ప్రశంసించారు.

విజయవాడ వేదికగా ఆదివారం ఘనంగా ముగిసిన సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్థానిక క్రీడాకారిణి తమిరి సూర్య చరిష్మ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో రిత్విక్ సంజీవి ఛాంపియన్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు.

మహిళల సింగిల్స్ ఫైనల్‌లో 19 ఏళ్ల సూర్య చరిష్మ, తన్వి పత్రిపై 17-21, 21-12, 21-14 స్కోరుతో అద్భుత విజయం సాధించింది. తొలి గేమ్‌లో పరాజయం ఎదురైనా, స్థానిక క్రీడాకారిణిగా ప్రేక్షకుల నుంచి లభించిన ఉత్సాహభరిత మద్దతుతో ధైర్యంగా పుంజుకుని గొప్ప పునరాగమనం చేసింది. ఇక పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో రిత్విక్ సంజీవి 21-16, 22-20 తేడాతో భరత్ రాఘవ్‌పై విజయం సాధించాడు.

ఇతర విభాగాల్లో మహిళల డబుల్స్‌లో శిఖా గౌతమ్–అశ్విని భట్ జోడీ విజేతలుగా నిలవగా, పురుషుల డబుల్స్‌లో హరిహరన్–రుబన్ కుమార్ జంట టైటిల్‌ను దక్కించుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి–రాధిక శర్మ జోడీ అత్యుత్తమ ప్రదర్శనతో విజేతలుగా నిలిచింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి