అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు దసరా సెలవుల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే ఉండగా, తాజా నిర్ణయంతో మూడు రోజులు ముందే ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 12 రోజులు విద్యార్థులకు దసరా సెలవులు లభించనున్నాయి.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాలలకు సెలవులు ముందుగానే ఇవ్వాలని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని విద్యా శాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని లోకేష్ స్పష్టం చేశారు.
మొదటగా ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, సెలవులు కేవలం 9 రోజులు మాత్రమే ఉండేలా నిర్ణయించారు. అయితే, ఉపాధ్యాయులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి, సెలవులను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. చివరికి ప్రభుత్వం స్పందించి, అదనంగా మూడు రోజులు జోడించి మొత్తం 12 రోజులకు దసరా సెలవులను పొడిగించింది.
దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తోందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



