ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యా హక్కు చట్టం (RTE) కింద 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం ఉచిత కోటా సీట్ల భర్తీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది.
ఈ పథకం ద్వారా అర్హత కలిగిన పేద విద్యార్థులు తమ నివాస ప్రాంతానికి సమీపంలోని ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సీట్ల లభ్యత, అర్హతలు తదితర అంశాల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఒకటో తరగతి ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. దరఖాస్తులను http://cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా గ్రామ, వార్డు సచివాలయాలు, మండల విద్యావనరుల కేంద్రాలు, సంబంధిత పాఠశాలల ద్వారా సమర్పించవచ్చు.
రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు 2020 జూన్ 2 నుంచి 2021 మే 31 మధ్య జన్మించిన పిల్లలు అర్హులు. ప్రవేశాలకు సంబంధించిన అధికారిక ప్రకటనను శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ నెల 7 నుంచి 16 వరకు ప్రైవేటు పాఠశాలలు తమ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. 20 నుంచి మార్చి 10 వరకు విద్యార్థుల ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
మార్చి 17న గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా విద్యార్థుల అర్హతను నిర్ధారిస్తారు. మార్చి 25న మొదటి విడత సీట్ల కేటాయింపు చేపడతారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 7 వరకు ప్రవేశాల ధ్రువీకరణ జరుగుతుంది.
అనంతరం ఏప్రిల్ 12న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఏప్రిల్ 13 నుంచి 23 వరకు పాఠశాలల ద్వారా విద్యార్థుల ప్రవేశాల ధ్రువీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియకు సంబంధించి సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 8599 ను సంప్రదించవచ్చని విద్యాశాఖ సూచించింది.



