ఏపీలో మోంతా తుఫాన్ ప్రభావం వేగంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం వరకు పొడిగా ఉన్న కోస్తా జిల్లాల్లో సాయంత్రం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. తాజా వాతావరణ సమాచార ప్రకారం, తుఫాన్ అర్థరాత్రికల్లా తీరం దాటే అవకాశం ఉన్నప్పటికీ, అది కాకినాడకు బదులుగా మచిలీపట్నం వైపుకు దిశ మార్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మార్పుతో కోస్తా ప్రాంత ప్రజల్లో టెన్షన్ నెలకొంది.
తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) సూచనల మేరకు ప్రభావిత జిల్లాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించాయి. కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోని చింతూరు, రంపచోడవరం డివిజన్లు అత్యధిక ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి.
ఈ జిల్లాల్లో మంగళవారం రాత్రి 8:30 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల వాహన రాకపోకలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలు, గ్రామీణ రహదారులు అన్నీ ఈ ఆంక్షల పరిధిలో ఉంటాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
అయితే అత్యవసర వైద్య సేవలు, రక్షణ చర్యలు వంటి ముఖ్య అవసరాలకే మినహాయింపు ఇచ్చారు. ప్రజలు వీలైనంతవరకు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ సమయంలో సముద్ర తీర ప్రాంతాలు, తక్కువ ఎత్తైన ప్రాంతాలకు వెళ్లడం పూర్తిగా నిషేధించబడింది.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం –
“ఈ ఆంక్షలు ఎవరి వ్యక్తిగత అసౌకర్యం కోసం కాదు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం మాత్రమే అమలు చేస్తున్నాము. తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే ఆంక్షలు ఎత్తివేస్తాం.”
అదనంగా, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని, లేదా తాత్కాలికంగా సురక్షిత ప్రదేశాల్లో వాహనాలను నిలిపివేయాలని సూచించారు. తుఫాన్ ప్రభావం తగ్గేవరకు ప్రజలు శాంతంగా ఉండి, పోలీసు శాఖతో పూర్తి సహకారం అందించాలన్నారు.
వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ, పోలీసు శాఖ జారీ చేసే ప్రతి హెచ్చరికను, సూచనను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 ద్వారా లేదా స్థానిక పోలీస్ అధికారులను సంప్రదించమని సూచించారు.



