ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.46 కోట్లు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదుల కుటుంబాలకు అండగా నిలుస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 1,150 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు రూ.46 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధుల కింద ప్రతి కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది.

ఈ మేరకు ప్రభుత్వం రెండు వేర్వేరు జీవోలను జారీ చేస్తూ అర్హులైన న్యాయవాదుల జాబితాను ఖరారు చేసింది. “ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ మ్యాచింగ్ గ్రాంట్” కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. మరణించిన న్యాయవాదుల నామినీలకు నేరుగా ఈ సాయం చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ నిధుల పంపిణీకి సంబంధించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీ బార్ కౌన్సిల్ కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది. న్యాయశాఖ కార్యదర్శి గొట్టపు ప్రతిభా దేవి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

వృత్తి నిర్వహణలో ఉండగానే దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సాయం ఆ కుటుంబాలకు కొంత ఆర్థిక బలాన్ని, మానసిక ఊరటను అందిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి