రాష్ట్రంలోని ప్రతి అర్హ నిరుపేద కుటుంబానికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కట్టుదిట్టంగా కృషి చేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ప్రకటించారు.
శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల కేటాయింపులో పలు అవకతవకలు, లోపాలు చోటుచేసుకున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. సెంటు, సెంటున్నర స్థలాలను నివాసయోగ్యం కాని, నిర్మాణాలకు అనువుకాని ప్రాంతాల్లో ఇచ్చి, ప్రజలను గుదిబండల్లా మార్చడం జరిగిందని పేర్కొన్నారు.
మంత్రి ఎక్కడైతే ఇళ్ల నిర్మాణాలు జరగలేదో, అటువంటి లేఅవుట్లను చట్టపరంగా రద్దు చేసి, లబ్ధిదారులను ఒప్పించి, వారికి రెండు లేదా మూడు సెంట్ల స్థలాలు ఇవ్వడంపై నేటి సమావేశంలో విశ్లేషణాత్మకంగా చర్చించామన్నారు.
ఇక చాలా చోట్ల ప్రభుత్వ లేఅవుట్ల కోసం ప్రైవేటు భూములు సేకరించి, భూ యజమానులకు పూర్తి మొత్తంలో పరిహారం చెల్లించకపోవడం, దానివల్ల లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వలేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన వివరించారు. దీంతో భూ యజమానులు, లబ్ధిదారులు ఇద్దరూ ఇబ్బందులు పడినట్టు తెలిపారు.
ఈ సంక్లిష్ట సమస్యలను పరిష్కరించేందుకు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని, త్వరలో అధికారుల స్థాయిలో మరో సమీక్షా సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై తగిన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
జర్నలిస్టులకు గుడ్‌న్యూస్ ఇచ్చిన మంత్రి పార్థసారధి
జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి అందించాలనే ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని మంత్రి పార్థసారధి మరోసారి ధృవీకరించారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లీగల్ అడ్డంకులు ఉన్నందున, వాటిని అధిగమించేందుకు అడ్వకేట్ జనరల్‌తో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు.
అడ్వకేట్ జనరల్ అభిప్రాయం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి, తదుపరి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
జర్నలిస్టులకు కేవలం స్థలాలు మాత్రమే కాకుండా, వాటిపై ఇళ్లు కూడా నిర్మించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్టు మంత్రి తెలిపారు.



