ఏపీలో వరద ముప్పు: కృష్ణా–గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌పై వర్షాల బీభత్సం కొనసాగుతోంది. ఒడిశా తీర సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా వైపు కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

తీరప్రాంతాల్లో గంటకు 40–60 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారుల సూచన. అంతేకాక, రాష్ట్రవ్యాప్తంగా వినాయక మండపాల నిర్వాహకులు వర్షాల దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం?

  • అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు – మోస్తరు నుండి భారీ వర్షాలు.
  • పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు – తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.
  • మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం.

ఇప్పటికే బుధవారం రాత్రి కొన్ని చోట్ల గణనీయమైన వర్షపాతం నమోదైంది:

  • మన్యం జిల్లా సీతంపేట – 77 మిమీ
  • కోనసీమ జిల్లా మలికిపురం – 74.5 మిమీ
  • భీమవరం – 67.5 మిమీ
  • విజయవాడ పశ్చిమ – 62.5 మిమీ
  • విజయవాడ సెంట్రల్ – 62 మిమీ

నదీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్

ఎగువ రాష్ట్రాల నుంచి వరదనీరు చేరడం, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో కలిపి కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు ఏర్పడింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

  • పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నాలు చేయరాదు.
  • స్నానాలు, ఈతలు వంటివి మానుకోవాలి.
  • వినాయక నిమజ్జన సమయంలో నదీ, కాలువల వద్ద అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలి.

విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రజలను జాగ్రత్తగా ఉండాలని, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యుత్ శాఖ హెచ్చరికలు

వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, వైర్లు ప్రమాదకరమవుతాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు.

  • ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లకు దగ్గర కావద్దు.
  • వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ సహకారం తీసుకోవాలి.
  • ప్రమాదాల నివారణకు విద్యుత్ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు.
  • చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి