ఏపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం, ఇప్పటికే సూపర్ సిక్స్‌లో భాగంగా పలు పథకాలను ప్రారంభించింది. ఇప్పుడు దివ్యాంగుల కోసం మరో ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.
ఏపీలో దివ్యాంగులకు ఇప్పటికే నెలకు రూ.6 వేల పింఛన్ అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్న విషయం తెలిసిందే. పని చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ పింఛన్ ఎంతో ఉపయోగపడుతోంది. ఇదే క్రమంలో వారి జీవనాన్ని మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో, దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాలను అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ వాహనాల ద్వారా దివ్యాంగులు స్వయంగా ప్రయాణం చేయడంతో పాటు, ఉపాధి అవకాశాలను కూడా పొందవచ్చని దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి తెలిపారు. త్వరలోనే ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని వెల్లడించారు.
తొలి దశలో 1750 మందికి లబ్ధి
తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 10 మందికి ఉచితంగా బైక్‌లు అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.17.50 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం 1750 మంది దివ్యాంగులను ఈ పథకానికి ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
అలాగే దివ్యాంగుల కోసం విశాఖపట్నంలో రూ.200 కోట్లతో పారా స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. అక్కడ వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చి, ప్రతిభను వెలికితీస్తామని చెప్పారు. ఉపాధి అవకాశాల కోసం 21 సెంచరీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సహకారంతో ఉచిత శిక్షణ కూడా అందించనున్నట్లు వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్లకు రేషన్ కార్డులు, ఉపాధి కల్పన కూడా చేపడతామని పేర్కొన్నారు.
అర్హతలు ఇవే
దివ్యాంగులకు అందించే ఒక్క వాహనం విలువ సుమారు రూ.లక్ష ఉంటుంది. ఈ బైక్‌ను ఉచితంగా పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉండాలి. వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉండాలి. కనీసం 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలి. వయస్సు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రతి సంవత్సరం ఈ వాహనాల పంపిణీ కొనసాగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా అమలవుతుందని మంత్రి తెలిపారు.
ఈ పథకం ద్వారా దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.



