ఏపీలో విద్యార్థులకు కూటమి ప్రభుత్వం కీలక గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో భాగంగా రూ.1200 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు తక్షణ ఊరట లభించింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా ఇప్పటివరకు అనేక కాలేజీలు పరీక్షల హాల్ టికెట్లు, కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్లను నిలిపివేయడం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన నిధులతో ఇకపై కాలేజీలు హాల్ టికెట్లు, సర్టిఫికెట్లను ఆపకుండా విద్యార్థులకు అందజేయడానికి మార్గం సుగమమైంది.
వైసీపీ హయాం నుంచే కొనసాగుతున్న బకాయిలు
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్య గత వైసీపీ ప్రభుత్వ కాలం నుంచే కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిధుల కొరత కారణంగా పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లించలేకపోయింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.7 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఈ బకాయిల్లో తొలి విడతగా రూ.1200 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పెద్ద ఊరట దక్కనుంది. ప్రభుత్వ ఉత్తర్వులపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జ్ఞానభూమి ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్
రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ కోర్సుల్లో పూర్తి ట్యూషన్ ఫీజును ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ రూపంలో ఆయా కాలేజీలకు నేరుగా చెల్లిస్తోంది. ఈ పథకానికి అర్హులైన విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాల విద్యార్థులకు ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. ఇందులో ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, ఇతర ఫీజులు, పరీక్ష ఫీజులను నేరుగా కాలేజీ ఖాతాలకు జమ చేస్తున్నారు.
మెయింటెనెన్స్ ఫీ వివరాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు మెయింటెనెన్స్ ఫీగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారు.
- ఐటీఐ విద్యార్థులకు – రూ.10,000
- పాలిటెక్నిక్ విద్యార్థులకు – రూ.15,000
- డిగ్రీ, పై చదువులు చదువుతున్న విద్యార్థులకు – రూ.20,000
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఫీజు సమస్యలు కొంతవరకు పరిష్కారమవుతాయని, మిగిలిన బకాయిలను కూడా త్వరలో విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



