రాష్ట్రంలో అరటి, పత్తి, మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ధరల పతనం, కొనుగోళ్లలో జాప్యం, మార్కెట్ డిమాండ్ తగ్గిపోవడం వంటి అంశాలపై ఆయన ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులు ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రాయలసీమ అరటికి కొత్త ఊపిరి: రైళ్ల ద్వారా ముంబై, కలకత్తాకు భారీ రవాణా
రాయలసీమలో 40 వేల హెక్టార్లలో పండుతున్న అరటికి మార్కెట్లో సరైన ధర రాకపోవడం సీఎం নজరలోకి వచ్చింది. డిసెంబరు మొదటి వారం నుంచి ధరలు పెరగొచ్చని అధికారులు వివరించినప్పటికీ, అప్పటివరకు రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.
- రాయలసీమ అరటిని ముంబై, కలకత్తా వంటి ప్రధాన మార్కెట్లకు రైల్వే వ్యాగన్ల ద్వారా భారీగా తరలించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు
- దీనికి ఒక ఏజెన్సీ ముందుకు రావడంతో సమగ్ర రవాణా ప్రణాళిక రూపొందించమని సూచన
- అరటి ధరలు, కొనుగోళ్లపై వ్యాపారులతో దైనందిన సమావేశాలు
- మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలి అని ఉద్యాన, మార్కెటింగ్ శాఖలకు ఆదేశాలు
మొక్కజొన్న రైతులకు భారీ ఊరట: ధరల వ్యత్యాసాన్ని ప్రభుత్వం భర్తీ చేసే దిశగా పరిశీలన
మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్న మొక్కజొన్న రైతులపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు.
- ధరల వ్యత్యాసాన్ని ధరల స్థిరీకరణ నిధి ద్వారా చెల్లించే ప్రతిపాదన పరిశీలనలో
- ఈ సీజన్‌లో 8.18 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా
- వీటిలో 2.04 లక్షల MTలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి అని ఆదేశాలు
- భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఇతర ఏజెన్సీలను ప్రయోగాత్మకంగా కొనుగోళ్లలోకి దించడం
పత్తి రైతులకు పక్కా భరోసా: “పత్తి కొనుగోళ్లలో ఇబ్బంది అంటే సహించం” – సీఎం
పత్తి కొనుగోళ్లలో సమస్యలు తలెత్తితే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
- రానున్న వర్షాల దృష్ట్యా కొనుగోళ్లు వేగవంతం చేయాలి
- రంగు మార్చిన, తడి పడిన పత్తినీ కొనుగోలు చేయాలి అని స్పష్టమైన ఆదేశాలు
- సీసీఐ నిబంధనల్లో పేర్కొన్న తేమ శాతం వంటి అంశాలతో రైతులు నష్టపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి
- స్లాట్ బుకింగ్ సమస్య పరిష్కారమైందని అధికారులు తెలపగా,
- కొనుగోలు కేంద్రాలను రోజువారీగా తనిఖీ చేసి, రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సీఎం సూచనలు



