AP DSC 2026 Notification: ఉగాది నాటికి 3600 టీచర్ పోస్టులు భర్తీ

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏపీలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాదికీ డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను సేకరించింది. మొత్తం సుమారు 3,600 పోస్టులు ఉండొచ్చని అంచనా. అందువల్ల మార్చిలో, అంటే ఉగాది పండుగ సమయానికే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ మేరకు ఈ ఏడాది కూడా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఏప్రిల్‌లో 16,347 పోస్టులతో డీఎస్సీ ప్రకటించగా, అందులో 15,941 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. కొన్నిచోట్ల రిజర్వేషన్ అభ్యర్థులు లేకపోవడంతో కొన్ని పోస్టులు ఖాళీగానే మిగిలాయి.

ఈ ఏడాది డీఎస్సీకి కూడా గత ఏడాది మాదిరిగానే సిలబస్‌, మార్గదర్శకాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రత్యేక డీఎస్సీ సిలబస్‌ను అధికారులు అందుబాటులో ఉంచారు.

ఈ ఏడాది నిర్వహించనున్న డీఎస్సీలో భాగంగా రాష్ట్ర సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, అలాగే ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థల నుంచి ఖాళీల వివరాలను అధికారులు సేకరించారు. వీటిలో సుమారు 1,200 ఖాళీలు ఉండగా, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, ప్రభుత్వ పాఠశాలల్లో 1,700 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో సుమారు 700 పోస్టులు ఉన్నట్లు అంచనా. మొత్తం కలిపి దాదాపు 3,600 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.

అలాగే, ప్రస్తుతం కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీరికి కనీస టైమ్ స్కేల్ అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి