ఏపీలో DL, RC కార్డులకు కీలక మార్పు: చిప్ స్థానంలో క్యూఆర్ కోడ్

ఆంధ్రప్రదేశ్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల్ని జారీ చేస్తుండగా, వాటి స్థానంలో తక్కువ ఖర్చుతో క్యూఆర్ కోడ్ ఆధారిత కార్డులను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ విధానం త్వరలో అమలులోకి రానుంది. ఇకపై కొత్తగా జారీ చేసే డీఎల్, ఆర్సీ కార్డులతో పాటు, గతంలో జారీ అయిన చిప్ కార్డుల స్థానంలో కూడా క్యూఆర్ కోడ్ కార్డులు తీసుకునే అవకాశం కల్పించనున్నారు.

చిప్‌కు బదులుగా క్యూఆర్ కోడ్ కార్డులు

ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాస్ అయిన తర్వాత జారీ చేసే డీఎల్ కార్డులు, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డులు చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులుగా ఇచ్చేవారు. ఈ కార్డుల్లో వాహనదారుల వివరాలు చిప్‌లోనే భద్రపరచబడేవి. అయితే, ఇప్పుడు చిప్‌కు బదులుగా క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల తయారీ ఖర్చు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి భారీగా ఆదా కలగనుంది.

డబ్బులు వసూలు చేసినా కార్డులు రాని పరిస్థితి

గతంలో ప్రతి ఆర్సీ లేదా డీఎల్ స్మార్ట్ కార్డు కోసం రూ.200 ఫీజు, పోస్టల్ ఛార్జీలు రూ.35 కలిపి మొత్తం రూ.235 ముందుగానే వసూలు చేసేవారు. అయితే, చాలా సందర్భాల్లో కార్డులు వాహనదారుల ఇళ్లకు చేరడం లేదు. ఈ నేపథ్యంలో 2023 నుంచి కార్డుల ఫీజు వసూలు చేయడం నిలిపివేయడంతో పాటు కార్డుల జారీ కూడా ఆపేశారు. అనంతరం కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 అక్టోబర్ 1 నుంచి మళ్లీ ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మందికి కార్డులు అందలేదు.

క్యూఆర్ కోడ్ కార్డుల విధానం

చిప్ ఆధారిత స్మార్ట్ కార్డు ఒక్కదానికి సుమారు రూ.115 ఖర్చవుతుండగా, క్యూఆర్ కోడ్ కార్డు తయారీకి రూ.72 మాత్రమే ఖర్చవుతోంది. అంతేకాకుండా, చిప్ కార్డుల డేటాను చదవాలంటే ప్రత్యేక రీడర్లు అవసరం కాగా, క్యూఆర్ కోడ్ కార్డులు నేరుగా VAHAN పోర్టల్‌కు లింక్ అయి ఉంటాయి. దీంతో కార్డు స్కాన్ చేస్తే వెంటనే సంబంధిత వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఈ కారణంగా ఇకపై క్యూఆర్ కోడ్ ఆధారిత కార్డులనే జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ విధానం ప్రకారం 2024 అక్టోబర్ 1 నుంచి ఇవ్వాల్సిన పెండింగ్ కార్డులను క్యూఆర్ కోడ్ ఫార్మాట్‌లో జారీ చేయనున్నారు. అంతేకాకుండా, అంతకుముందు చిప్ కార్డుల కోసం దరఖాస్తు చేసి కార్డులు పొందని వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి