అమరావతి: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. అసెంబ్లీలో హోంశాఖ బడ్జెట్ డిమాండ్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణకు తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు “రప్పా రప్పా” అంటూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
రాష్ట్ర అభివృద్ధికి లా అండ్ ఆర్డర్ అత్యంత కీలకమని, గత ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి బలహీనంగా ఉండటంతో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ మెరుగ్గా అమలవుతున్నందువల్లే నేరాల రేటు తగ్గిందని చెప్పారు. ఇదే కారణంగా దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ పాలనలో మహిళలు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయని, చట్టబద్ధత లేని దిశా యాప్ పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు కట్టుబడి ఉందని చెప్పారు. శక్తి యాప్, శక్తి టీమ్స్ ద్వారా మహిళల రక్షణకు కృషి చేస్తున్నామని, అందువల్ల రాష్ట్రంలో మహిళలపై నేరాలు 4.4 శాతం తగ్గాయని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని, గీత దాటితే కటకటాలేనని హెచ్చరించారు.
సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.



