ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, నేషనల్ హైవే (ఎన్‌హెచ్) ప్రాజెక్టులకు మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర మౌలిక వసతులు, లాజిస్టిక్స్ అభివృద్ధిపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న రైల్వే, రోడ్డు ప్రాజెక్టులు నిర్దేశిత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రైల్వే, రవాణా ప్రాజెక్టులకు భూసేకరణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు ఉన్న ప్రధాన రైల్వే లైన్‌ను నాలుగు వరుసలకు విస్తరించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా 774 రైల్వే క్రాసింగ్‌ల వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ఆర్‌ఓబీలు), రోడ్ అండర్ బ్రిడ్జిలు (ఆర్‌యూబీలు) నిర్మించాల్సిందిగా సూచించారు. ఇవి పూర్తయితే సరుకు రవాణా మరింత వేగవంతమవుతుందని సీఎం పేర్కొన్నారు. భూసేకరణ పనులు గడువు లోపల పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
బుల్లెట్ రైలు కారిడార్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు భారీ ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్–అమరావతి–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, చెన్నై–బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్‌లు అమలులోకి వస్తే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అంశంలో తమకు సంబంధం లేదన్న భావనతో కలెక్టర్లు వ్యవహరించకూడదని, ప్రతి జిల్లా స్థాయిలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన హెచ్చరించారు.
రవాణా వ్యయం తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రవాణా ఖర్చు కీలకమని, ప్రస్తుతం సుమారు 14 శాతంగా ఉన్న రవాణా వ్యయాన్ని 7 నుంచి 8 శాతానికి తగ్గించడమే లక్ష్యమని తెలిపారు. రవాణా ఖర్చు తగ్గాలంటే వాటర్‌వేలు అత్యంత సమర్థవంతమైనవని, వాటితో పాటు రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, విమాన మార్గాలు సమన్వయంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీ ప్లేన్ సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలవబోతోందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైలు, రోడ్డు మార్గాల అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 400 లక్షల టన్నుల ఉద్యాన పంటల ఉత్పత్తి జరుగుతోందని, రానున్న నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో అది 1000 లక్షల టన్నులకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ పంటలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేరాలంటే బలమైన లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు అవసరమని స్పష్టం చేశారు. ఇప్పటికే అనంతపురం జిల్లా నుంచి రైళ్ల ద్వారా అరటి రవాణా జరుగుతోందని, ఇదే తరహాలో అన్ని పంటల రవాణాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే రైలు, రోడ్డు మార్గాల పురోగతి పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు.



