రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.1,500 ఫిక్స్? | ఏపీ బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు పూర్తి చేస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారవగా, ఈ సమావేశాలు రాజకీయంగా, పాలనా పరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఇప్పటికే నాలుగు పథకాలను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం, మిగిలిన హామీలపై కూడా కసరత్తు వేగవంతం చేసింది. పెండింగ్ పథకాలపై స్పష్టమైన ప్రకటనలు చేయాలన్న దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశమై అజెండా, పని దినాల సంఖ్యపై నిర్ణయం తీసుకోనుంది. బడ్జెట్ సమావేశాలు కావడంతో ఫిబ్రవరి 14న 2025–26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈసారి ప్రత్యేకతగా వ్యవసాయ బడ్జెట్‌తో పాటు, ఇరిగేషన్ కేటాయింపులకు సంబంధించి మరో ప్రత్యేక బడ్జెట్‌ను కూడా ప్రతిపాదించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొత్తం 18 నుంచి 21 పని దినాల పాటు సమావేశాలు కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 28న జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కేటాయింపులపై కసరత్తు

ఈ బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమ ప్రాధాన్యత ఇచ్చేలా నిధుల కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ‘సూపర్ సిక్స్’ హామీల్లో కీలకమైన నాలుగు పథకాలు ఇప్పటికే అమల్లో ఉండగా, మిగిలిన వాటిపై ప్రతిపక్షం ప్రశ్నలు సంధిస్తోంది. ముఖ్యంగా ‘ఆడబిడ్డ నిధి’ పథకంపై ప్రకటన చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో, ఈసారి బడ్జెట్‌లో రాష్ట్రంలోని 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల అర్హులైన మహిళలందరికీ ప్రతి నెల రూ.1,500 అందించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

అదే సమయంలో అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, అలాగే ఇతర కీలక సంక్షేమ రంగాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలనలో రెండేళ్లు పూర్తి చేసి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ బడ్జెట్ కూటమి ప్రభుత్వానికి దిశానిర్దేశకంగా మారనుంది.

ఇక సమావేశాల తొలి రోజున జరిగే గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మిగిలిన రోజుల్లో సభకు హాజరు కావాలా లేదా అన్న విషయంపై వైసీపీ తుది నిర్ణయం ఇంకా స్పష్టత పొందాల్సి ఉంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి