గ్రేటర్ విజయవాడకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ – ఈ నెలాఖరులో నోటిఫికేషన్?

ఏపీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని ప్రాంతం అమరావతిలో కీలక భాగంగా ఉన్న విజయవాడ నగరాన్ని ‘గ్రేటర్ విజయవాడ’గా విస్తరించే దిశగా ప్రభుత్వం వేగవంతమైన అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రతిపాదనలు సమర్పించగా, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ నెలాఖరులోనే గ్రేటర్ విజయవాడ ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

ఇటీవల సీఎం చంద్రబాబును విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సహా సంబంధిత ఎమ్మెల్యేలు కలిశారు. ఈ భేటీలో గ్రేటర్ విజయవాడ ఏర్పాటు అంశంపై చర్చ జరగగా, సీఎం సానుకూలంగా స్పందించారు. అనంతరం వెంటనే అధికారులను పిలిపించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో సీఎంవో అధికారులు అదే సాయంత్రం గ్రేటర్ విజయవాడకు సంబంధించి ఇప్పటికే సిద్ధంగా ఉన్న ప్రతిపాదనల మేరకు స్థానిక సంస్థల తీర్మానాలను పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి స్పందించిన అధికారులు, ఆయా గ్రామ పంచాయతీలు ఇప్పటికే తీర్మానాలు చేసి అందజేశాయని సీఎంవోకు తెలియజేశారు.

గ్రేటర్ విజయవాడ పరిధిలోకి మొత్తం విజయవాడ నగరంతో పాటు 75 గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఇందులో 41 గ్రామాలు ఇప్పటికే 2018లోనే గ్రేటర్ విజయవాడ కోసం తీర్మానాలు చేసి ఉండగా, మిగతా గ్రామాలు తాజాగా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ తీర్మానాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అంశంపై సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్న స్పందిస్తూ, అన్ని ప్రక్రియలు సక్రమంగా పూర్తైతే ఈ నెలాఖరులోపే గ్రేటర్ విజయవాడకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 31లోపు నోటిఫికేషన్ వెలువడకపోతే పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ప్రతిపాదిత గ్రేటర్ విజయవాడ పరిధిలోకి మైలవరంలోని 23 గ్రామాలు, పెనమలూరు నియోజకవర్గంలోని 19 గ్రామాలు, గన్నవరం నియోజకవర్గంలోని 31 గ్రామాలను చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం విజయవాడ నగర పరిధిలో సుమారు 10.35 లక్షల మంది జనాభా నివసిస్తుండగా, గ్రేటర్‌లో విలీనం కానున్న గ్రామాల్లో దాదాపు 16 లక్షల మంది జనాభా ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన గ్రేటర్ విజయవాడ ఏర్పాటైతే మొత్తం జనాభా సుమారు 26 లక్షలకు చేరనుంది.

ఇక విస్తీర్ణ పరంగా చూస్తే, ప్రస్తుతం విజయవాడ నగర విస్తీర్ణం 61.88 చదరపు కిలోమీటర్లు కాగా, విలీన ప్రక్రియ పూర్తయ్యాక ఇది ఏకంగా 661 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగితే, విలీన గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశముంది. ఇది నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు కీలకంగా మారనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి