నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు–కంటైనర్ ఢీ.. ముగ్గురు సజీవదహనం

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గతంలో కర్నూలు సమీపంలో చోటు చేసుకున్న కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 42 మంది ప్రయాణికులు సజీవదహనం కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చేవెళ్ల వద్ద టీజీఎస్ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లోనూ పలువురు దుర్మరణం పాలయ్యారు. ఈ పరిణామాలతో ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుతామా అనే ఆందోళనలో జీవిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా నంద్యాల జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలవగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని శిరివెళ్లమిట్ట సమీపంలో కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఏఆర్ బీసీవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు శిరివెళ్లమిట్ట మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా టైర్ పేలిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి కుడివైపు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ ట్రక్‌ను ఢీకొట్టింది.

ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని కడప జిల్లాకు చెందిన భాస్కర్‌గా గుర్తించారు. బస్సు ఢీ తీవ్రతకు కంటైనర్ ట్రక్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ట్రక్ డ్రైవర్, క్లీనర్ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయి బయటకు రాలేక మంటల బారిన పడి సజీవదహనం అయ్యారు. కంటైనర్‌లో తరలిస్తున్న కొత్త బైకులు పూర్తిగా కాలిపోయాయి.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే 14 మందికి కాలిన గాయాలయ్యాయి. వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టుకుని ప్రయాణికులు బయటికి రావడంతో ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. బస్సు క్లీనర్‌తో పాటు అదే మార్గంలో వెళ్తున్న ఇతర వాహనదారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

సమాచారం అందగానే నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్, ఆళ్లగడ్డ డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో జాతీయ రహదారులపై భద్రతా చర్యలు మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి