ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే టాప్ ఫిల్మ్ షూటింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: కందుల దుర్గేశ్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే చిత్రీకరణలకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ప్రభావం విస్తరించిన ఈ కాలంలో, రాష్ట్ర సినిమాటోగ్రఫీ రంగం ఒక కొత్త దశలోకి ప్రవేశించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముంబైలో జరుగుతున్న సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ – 2025 కార్యక్రమంలో సోమవారం పెట్టుబడిదారులను ఉద్దేశించి మంత్రి దుర్గేశ్ ప్రసంగించారు. తెలుగు చిత్ర పరిశ్రమ సాధిస్తున్న విజయాలను ప్రస్తావించిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మాణం, షూటింగ్‌లకు ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు. సినీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని, చిత్రీకరణకు అవసరమైన ప్రతి అనుమతిని వేగంగా, పారదర్శకంగా కల్పించే విధంగా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు.

ఏపీని చిత్రీకరణకు ఆకర్షణీయ రాష్ట్రంగా మార్చేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునిక స్టూడియోలు, సులభ అనుమతులు వంటి అంశాలను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో సినీ, వినోద రంగాల్లో మరింత పెట్టుబడులు ఆకర్షించగలమనే నమ్మకం వ్యక్తం చేశారు.

మంత్రి కందుల దుర్గేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఏపీ సినిమాటోగ్రఫీ రంగంలో కొత్త శకానికి శ్రీకారం చుడుతున్నాం. సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ – 2025లో ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాటా గారితో కలిసి పాల్గొని, రాష్ట్రంలో ఫిల్మ్, టూరిజం రంగాల భవిష్యత్తు అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించాను. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కల్కి 2898 AD వంటి చిత్రాల విజయాలతో తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్‌గా మారింది. ఏపీలోనే 1,100 పైగా స్క్రీన్లు ఉండటం, సినీ రంగంలో రాష్ట్ర ప్రాధాన్యతను స్పష్టంగా సూచిస్తున్నది” అని తెలిపారు.

ఫిల్మ్ టూరిజంను ప్రోత్సహించేందుకు సమగ్ర విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు, అత్యాధునిక స్టూడియోలు, డబ్బింగ్, రీ-రికార్డింగ్ సదుపాయాల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. అలాగే, ప్రభుత్వ ఆస్తులు, పర్యాటక ప్రదేశాలు, బహిరంగ ప్రాంతాల్లో షూటింగ్ అనుమతులకు మరింత పారదర్శక, వేగవంతమైన విధానాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు. సంవత్సరాల తర్వాత ప్రతిష్ఠాత్మక నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను పునరుద్ధరించనున్నట్టు ప్రకటించారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన మంత్రి దుర్గేశ్, పర్యాటక, ఆతిథ్య రంగాలకు ప్రభుత్వం ‘ఇండస్ట్రీ స్టేటస్’ కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. భూమి కొనుగోలు లేదా లీజుపై 100 శాతం స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీల మినహాయింపు, 15 సంవత్సరాలపాటు 100 శాతం SGST రీయింబర్స్‌మెంట్ వంటి ప్రోత్సాహకాలను పెట్టుబడిదారులకు అందిస్తున్నట్టు తెలిపారు.

స్వర్ణాంధ్ర విజన్–2047లో భాగంగా, AI, VFX, అనిమేషన్, గేమింగ్ రంగాలకు అనుకూల వాతావరణం సృష్టిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ‘ఆంధ్రా వ్యాలీ’గా మార్చడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వివరించారు. విశాఖపట్నం, అరకు, లంబసింగి, శ్రీశైలం, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రాంతాలను యాంకర్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తూ 21 థీమాటిక్ టూరిజం సర్క్యూట్‌లలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.

సమ్మిట్ సందర్భంగా సోనీ, యూట్యూబ్ ఇండియా, క్యూబ్ సినిమా, ఇమాజికా వరల్డ్, థామస్ కుక్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. భారతీయ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని $100 బిలియన్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నట్టు మంత్రి దుర్గేశ్ పేర్కొన్నారు. బాధ్యతాయుత, పారదర్శక, వ్యాపారానుకూల పాలనతో రాష్ట్రం పెట్టుబడిదారులకు అత్యంత విశ్వసనీయ గమ్యస్థానంగా నిలుస్తుందని అన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి