ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా డీల్

ఆంధ్రప్రదేశ్ మిర్చి ఘాటు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అమెరికా సహా పలు విదేశీ దేశాలు ఆంధ్రా మిర్చికి ఫిదా అవుతున్నాయి. ప్రతి ఏడాది భారత్ నుంచి భారీ స్థాయిలో మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతుండగా, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా గణనీయంగా ఉంది. 2025లో భారత్ నుంచి సుమారు 7.15 లక్షల టన్నుల మిర్చి ఎగుమతి కాగా, అందులో దాదాపు 44 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండటం విశేషం. ఈ ఎగుమతుల ద్వారా కేంద్రానికి సుమారు రూ.11 వేల కోట్ల ఆదాయం వస్తోంది.

సారవంతమైన నేల, అనుకూల వాతావరణం కారణంగా ఆంధ్రప్రదేశ్ మిర్చి సాగుకు అనువైన రాష్ట్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పండే మిర్చికి దేశవిదేశాల్లో మంచి గుర్తింపు ఉంది. గుంటూరు సన్నం, బ్యాది, తేజ, 334, ముండు వంటి ఐదు రకాల మిర్చులు అంతర్జాతీయ కొనుగోలుదారుల తొలి ఎంపికగా మారాయి. పంటకు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో రైతులు కూడా మిర్చి సాగుపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో ఆంధ్రా మిర్చి కీలక పాత్ర పోషిస్తోంది. సాస్‌లు, సీజనింగ్‌లు, మసాలా మిశ్రమాల తయారీలో విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఫార్మాస్యూటికల్ రంగంలో నొప్పి నివారణ క్రీమ్‌లు, వెయిట్ లాస్ సప్లిమెంట్లు, రోగనిరోధక మందుల్లో మిర్చి సారాన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే కాస్మెటిక్స్ రంగంలో చర్మ సంరక్షణ ఉత్పత్తులు, జుట్టు పెరుగుదల చికిత్సల్లోనూ ఆంధ్రా మిర్చికి డిమాండ్ పెరుగుతోంది. కొన్ని ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ పానీయాల్లో కారంగా ఉండే రుచికి కూడా ఈ మిర్చిని వాడుతున్నారు.

యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, వియత్నాం, చైనా, బంగ్లాదేశ్, మలేషియా వంటి దేశాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి మిర్చి ఎగుమతి అవుతోంది. తాజాగా విదేశీ కంపెనీలు నేరుగా ఏపీ, తెలంగాణల్లో అడుగుపెడుతూ రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో విదేశీ కంపెనీలు మిర్చి రైతులతో డైరెక్ట్ అగ్రిమెంట్లు చేసుకుని పంటను దగ్గరుండి పండిస్తున్నాయి.

ఈ ఒప్పందాల ప్రకారం రైతులు ఎక్కువ పురుగుమందులు వాడకుండా ఆర్గానిక్ విధానాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. పంటను గ్రేడులుగా విభజించి హైదరాబాద్‌కు తరలించి, అక్కడి ఫ్యాక్టరీల్లో మిర్చి పొడిగా తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. ముందుగానే ధర నిర్ణయించడంతో లాభనష్టాల భయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. పంట పర్యవేక్షణ మొత్తం కంపెనీ సిబ్బందే చూసుకోవడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కేఎఫ్‌సీ వంటి అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల మసాలాల్లో కూడా ఆంధ్రా మిర్చి కారాన్ని వినియోగిస్తున్నారని సమాచారం. విదేశీ ప్రతినిధులు స్వయంగా రైతుల వద్దకు వచ్చి పంటను పరిశీలించడంతో ఎన్టీఆర్ జిల్లా రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. తమ పండించిన మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతుండటం గర్వంగా ఉందని రైతులు చెబుతున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి