న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత ‘జబర్దస్త్’ షోతో యాంకర్‌గా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన చురుకైన మాటతీరు, సహజమైన ప్రెజెన్స్‌తో షో టీఆర్‌పీ రేటింగ్స్ పెంచడంలో కీలక పాత్ర పోషించిన అనసూయ, అతి తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్‌గా మారిపోయింది. గ్లామర్‌తో పాటు ప్రతిభను సమపాళ్లలో ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, యాంకరింగ్‌తో పాటు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుని నటిగా తనదైన ముద్ర వేసింది.
పాత్ర ఏదైనా సరే, దానిలో పూర్తిగా లీనమై పరకాయ ప్రవేశం చేయగల నటి అనసూయ అని పలుమార్లు నిరూపించింది. ముఖ్యంగా సుకుమార్–రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఆమె చేసిన నటనకు విశేషమైన ప్రశంసలు దక్కాయి. ఆ పాత్రకు అనసూయ తప్ప మరెవ్వరూ అంతగా న్యాయం చేయలేరనే స్థాయిలో ఆమె ఒదిగిపోయిందన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి.
అభిప్రాయాలను వివాదాలుగా మారుస్తున్నారు – అనసూయ
‘రంగస్థలం’ తర్వాత ‘పుష్ప’ సినిమాలో దాక్షాయిణిగా, ‘రజాకార్’ సినిమాలో మరింత పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది అనసూయ. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈమె క్రేజ్‌ను చూసి, సినిమాల్లో హీరోయిన్‌గా చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే పలు స్పెషల్ సాంగ్స్‌లో మెరిసిన అనసూయ, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తోంది. అయితే తాను చెప్పే మాటలను కొందరు కావాలని వివాదాలుగా మలుస్తున్నారని అనసూయ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
కొత్త బ్లాగ్ కోసం సలహా కోరిన అనసూయ
సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉండే అనసూయ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించింది. తాను త్వరలోనే కొత్తగా ఒక బ్లాగ్ ప్రారంభించబోతున్నానని, ఏ ప్లాట్‌ఫామ్‌లో బ్లాగింగ్ చేయడం బాగుంటుందో సలహా ఇవ్వాలని ఫాలోవర్స్‌ను కోరింది. దీనికి స్పందించిన అభిమానులు WordPress.org, Wix, Squarespace వంటి ప్రముఖ బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లను సూచించారు. మరికొందరు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలనే వినియోగించమని సూచించారు. ఈ సందర్భంగా “వాళ్లని వీళ్లని అడగడం ఎందుకు, చాట్ జిపిటిని అడగండి” అంటూ కొందరు కామెంట్ చేయగా, అందుకు అనసూయ తనదైన శైలిలో స్పందించింది. “నేను చాట్ జిపిటిని ఉపయోగించను. కేవలం మనుషుల్ని మాత్రమే నమ్ముతాను” అంటూ కౌంటర్ ఇచ్చింది.
ఇండస్ట్రీ గుట్టు రట్టు చేయబోతోందా?
ఇదిలా ఉండగా, ఓ అభిమాని “మీరు ప్రత్యేకంగా బ్లాగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అందులో ఎలాంటి విషయాలు పోస్ట్ చేయబోతున్నారు?” అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ ఇచ్చిన సమాధానం అందరినీ ఆలోచనలో పడేసింది. “నా మనసులో కొన్ని తీవ్రమైన అంశాలు ఉన్నాయి. పురుషులను ప్రశంసించి, మహిళలను ఎందుకు ప్రశ్నిస్తారు? టాలీవుడ్‌లో ఆడ, మగ అనే తేడాను ఎందుకు ఎక్కువగా చూపిస్తారు? ఇది లింగ వివక్ష కాదా? అలాగే తెలుగులో బయటి వారిని ఆరాధించి, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఈ వివక్షపై నా గొంతును విప్పబోతున్నాను” అని అనసూయ పేర్కొంది. చివర్లో “గోతికాడ నక్కలు ఎవరో కూడా చెబుతాను” అంటూ IYKYK (If You Know, You Know) అనే పదాన్ని జోడించడంతో ఆసక్తి మరింత పెరిగింది.
స్వీయ అనుభవాలే బ్లాగ్‌లో చోటు చేసుకుంటాయా?
సాధారణంగా IYKYK అనే పదాన్ని సోషల్ మీడియాలో లోతైన అనుభవాలు లేదా వాటిని ఎదుర్కొన్న వారికే అర్థమయ్యే విషయాల సందర్భంలో ఉపయోగిస్తారు. దీనిని బట్టి చూస్తే, అనసూయ తనకు ఇండస్ట్రీలో ఎదురైన వ్యక్తిగత అనుభవాలను కొత్త బ్లాగ్ ద్వారా బయటపెట్టబోతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అయితే ఆమె ఇండస్ట్రీలోని అంతర్గత విషయాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతోందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అనసూయ తన కొత్త బ్లాగ్‌లో ఎలాంటి సంచలన విషయాలు వెల్లడిస్తుందో చూడాలి.



