అనంతపురం: రేంజ్ దాటి రెచ్చిపోయిన ఓ యువకుడి రీల్ వీడియో ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. టాటూ చరణ్ అనే యువకుడు తన గ్యాంగ్‌తో కలిసి పోలీసులకు సవాల్ విసురుతూ, పోలీస్ స్టేషన్ ఎదుటే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. “దమ్ముంటే పట్టుకోరా షికావత్తూ” అంటూ ‘పుష్ప’ సినిమా డైలాగ్‌ను అనుకరిస్తూ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ యువకుడు తన గ్యాంగ్ సభ్యులతో కలిసి అనేక నేరాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సమాచారం ప్రకారం, టాటూ చరణ్, అతని అనుచరులు రాత్రివేళల్లో రోడ్లపై మాటు వేసి వాహనదారులపై దాడులు చేయడంతో పాటు దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు, అసభ్య ప్రవర్తనతో ఒంటరిగా ఉన్న మహిళలను బెదిరిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల మదకశిర ప్రాంతంలో క్షుద్రపూజల నేపథ్యంలో అశాంతి నెలకొనగా, అదే సమయంలో టాటూ చరణ్ మరో కేసులో అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాణినగర్‌లో నివసించే ఓ మహిళ ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించిన కేసులో పోలీసులు చరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇక అసలు వివాదాస్పద వీడియో విషయానికొస్తే, యువతిని బెదిరించిన అనంతరం ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కి చేరగా, అదే సమయంలో టాటూ చరణ్ పోలీస్ స్టేషన్ ఎదుట నిలబడి ‘దమ్ముంటే పట్టుకోరా షికావత్తూ.. పట్టుకుంటే వదిలేస్తా అనంతపురం’ అంటూ డైలాగ్ చెప్పి వీడియో తీశాడు. దీనిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్ అయింది.
తాజాగా, ఒక పౌరుడిపై దాడి చేసిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ కేసులను పరిశీలిస్తూ, గ్యాంగ్ వెనుకనున్న నెట్‌వర్క్‌ను గట్టిగా కదిలించేందుకు సిద్ధమవుతున్నారు.