ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ అనంతరం భారీ బందోబస్తు మధ్య అంబటి రాంబాబును వజ్ర వాహనంలో తరలించారు.
అరెస్ట్‌కు ముందు అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. తనను అరెస్ట్ చేయాలంటే ప్రభుత్వం ముందుకు రావాలని, జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. “మీ రెడ్‌బుక్‌కు నేను భయపడను. ఐ డోంట్ కేర్ చంద్రబాబు” అంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఈ పరిణామంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబు పై హత్యాయత్నం జరిగిందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ గూండాలు ఈ దాడికి పాల్పడ్డారంటూ జగన్ ఆరోపించారు.
ఈ ఘటనలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించిన వైఎస్ జగన్, ఇందుకు బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రంలో వైసీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.



