ప్రపంచవ్యాప్తంగా పాముల వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో ఎక్కువగా అనకొండ పాములు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తాజాగా కూడా అమెజాన్ నదిలో కనిపించిన ఒక భారీ అనకొండ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విస్తుపోతున్నారు.
సాధారణంగా అనకొండ పాములు 10 అడుగుల నుంచి గరిష్టంగా 55 అడుగుల వరకు పెరుగుతాయి. ఇవి విషపూరితమైనవి కాకపోయినా అత్యంత శక్తివంతమైన కండరాలతో తమ శత్రువులను కేవలం ఒత్తిడితోనే చంపేస్తాయి. అందుకే వీటి దగ్గరికి వెళ్లడానికి చాలా మందికి ధైర్యం ఉండదు.
ఇటీవల ఇంస్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో సుమారు 30 అడుగుల పొడవు ఉన్న ఒక భారీ అనకొండ పాము నదిలో ఈదుకుంటూ కనిపిస్తోంది. ఈ వీడియో వివరాల ప్రకారం — అమెజాన్ నదిపై హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఒక పైలెట్ నదిలో కదులుతున్న ఈ భారీ పామును గమనించాడు. వెంటనే తన కెమెరాతో దానిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
వీడియోలో కనిపించిన పాము యొక్క పరిమాణం, దాని కదలికలు చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. “ఇంత పెద్ద అనకొండ నిజంగానే ఉందా?” అని కామెంట్లతో ముంచెత్తుతున్నారు. మరోవైపు కొంతమంది ఇది నిజమైన వీడియో కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించబడిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోను ‘స్పేస్ ఎక్స్ప్లోరర్ AI’ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది. పలు వినియోగదారులు ఇది CGI లేదా AI ఆధారంగా రూపొందించబడిన సన్నివేశం కావచ్చని భావిస్తున్నారు. అయితే కొందరు మాత్రం “అమెజాన్ అడవుల్లో ఇంత పెద్ద పాములు నిజంగానే ఉన్నాయనే నిదర్శనం ఇది” అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఏది నిజమో తెలియకపోయినా, ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన హల్‌చల్ సృష్టిస్తోంది. ప్రకృతిలో అమెజాన్ అడవి వంటి ప్రాంతాల్లో ఇంతటి విపరీత పరిమాణం కలిగిన జీవులు ఉండటం, మనుషులలో ఇప్పటికీ ప్రకృతి రహస్యాల పట్ల ఆసక్తి తగ్గలేదని మరోసారి నిరూపించింది.



