అమరావతి పరిధిలో రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లకు కొత్త రూపం | అమృత్ భారత్ పథకం

రాజధాని అమరావతి పరిధిలో విజయవాడకు సమీపంగా ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్‌కు మంచి రోజులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పునర్నిర్మాణ పథకంలో భాగంగా ఈ స్టేషన్‌ను అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణికులకు అవసరమైన అన్ని ఆధునిక వసతులతో సరికొత్త రూపంలో తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం పునర్నిర్మాణ పనులు దాదాపు 80 శాతం వరకు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఈ స్టేషన్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇదే అమరావతి ప్రాంతంలో మరో కీలక రైల్వే స్టేషన్ అయిన మంగళగిరి కూడా తుది దశకు చేరుకుంటోంది. మంగళగిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయి. ఈ స్టేషన్‌ను ఎయిర్‌పోర్టుల తరహాలో ఒక కాంప్రహెన్సివ్ ట్రావెల్ హబ్గా అభివృద్ధి చేస్తున్నారు. సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్ సదుపాయాలు, రియర్ సైడ్ బిల్డింగ్, వీఐపీ లాంజ్ వంటి కీలక నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్లాట్‌ఫాం సర్ఫేసింగ్, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు, ఫెకేడ్ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకంను అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన స్టేషన్లను దశలవారీగా ఆధునీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ జాబితాలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, ఆదోని, అనంతపురం, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, గుడివాడ, గుత్తి, గుంటూరు, హిందూపురం, కదిరి, కాకినాడ టౌన్, కొత్తవలస జంక్షన్, కుప్పం, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, రాజంపేట, రేణిగుంట వంటి ప్రధాన స్టేషన్లు ఉన్నాయి. రాయనపాడు రైల్వే స్టేషన్ కూడా ఈ అభివృద్ధి జాబితాలో చోటు దక్కించుకుంది.

రాయనపాడు స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణం, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, టికెట్ కౌంటర్లు, ప్లాట్‌ఫామ్‌లపై షెడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయి. కొత్త ముఖద్వారం, విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, సౌకర్యవంతమైన వెయిటింగ్ హాల్, లిఫ్టులు, ఆధునిక టాయిలెట్లు, మెరుగుపరచిన ప్లాట్‌ఫామ్ ఉపరితలం వంటి వసతులతో ఈ స్టేషన్‌ను పూర్తిగా ఆధునీకరిస్తున్నారు.

ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత రాయనపాడు స్టేషన్‌లో మరిన్ని రైళ్లు ఆగేందుకు అవకాశం ఏర్పడనుంది. దీని ద్వారా ప్రస్తుతం తీవ్ర రద్దీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. విజయవాడలో నిత్యం వందకు పైగా రైళ్లు ఆగుతుండటంతో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రాయనపాడు స్టేషన్‌ను అభివృద్ధి చేయడం వల్ల కొన్ని రైళ్లకు ఇక్కడ హాల్ట్ సౌకర్యం కల్పించి, ప్రయాణికులకు మరింత సౌలభ్యం అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి