ఏపీ రాజధాని అమరావతికి విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణికులకు ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఇప్పటివరకు అమరావతికి వెళ్లాలంటే ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత కుడివైపుకు మళ్లి కరకట్ట రోడ్డు మీదుగా ప్రయాణించాల్సి వచ్చేది. అయితే ఈ రహదారి సింగిల్ రోడ్డుగా ఉండటంతో, రెండు వైపుల నుంచి వచ్చే వాహనాలకు తీవ్ర అసౌకర్యం ఎదురయ్యేది. చిన్నపాటి తప్పిదం జరిగినా వాహనాలు కరకట్ట నుంచి కిందపడే ప్రమాదకర పరిస్థితులు ఉండేవి. ఈ సమస్యలపై ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాన్నిచ్చాయి.
విజయవాడ నగరం నుంచి ఉండవల్లి సమీపంలోని కరకట్ట మీదుగా సాగుతున్న సీడ్ యాక్సెస్ రోడ్ ప్రయాణ మార్గాన్ని స్వల్పంగా మార్చి, పక్కనే మరో ప్రత్యామ్నాయ రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రకాశం బ్యారేజ్ దాటిన వెంటనే కరకట్టను తాకకుండా నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు చేరుకునేలా కొత్త రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో గుంటూరు చానల్‌పై నిర్మిస్తున్న వంతెన పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి పూర్తయ్యాక నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డుపై అమరావతికి చేరుకునే అవకాశం ఏర్పడనుంది.

ఇదిలా ఉండగా, అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన మిగిలిన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళగిరి వైపు సీడ్ యాక్సెస్ రోడ్డులో మిగిలిన సుమారు 1.5 కిలోమీటర్ల మార్గాన్ని తాజాగా పూర్తి చేశారు. ఈ మార్గాన్ని ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉన్న మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేయనున్నారు. దీని వల్ల విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే ప్రయాణంలో కరకట్టపై ప్రయాణించాల్సిన దూరం గణనీయంగా తగ్గనుంది.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు గుంటూరు చానల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను మంత్రి నారాయణ ఇటీవల పరిశీలించారు. ఈ నెలాఖరులోపు స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కరకట్టపై వెళ్లే అవసరం లేకుండా త్వరలోనే ఈ బ్రిడ్జిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ తెలిపారు.



