అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ట్విస్ట్: చంద్రబాబు–నారాయణ కేసు మూసివేతపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం

చంద్రబాబు నాయుడు, మున్సిపల్ మంత్రి నారాయణ నిందితులుగా ఉన్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ అక్రమాల కేసులో ఇవాళ కీలక మలుపు చోటుచేసుకుంది. కేసులో ఆధారాలు లేవంటూ ప్రభుత్వం దాఖలు చేసిన మూసివేత పిటిషన్‌కు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో పిటిషనర్‌గా ఉన్న వైసీపీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయం కోరుతూ కోర్టు నోటీసులు జారీ చేసింది.

గత వైసీపీ ప్రభుత్వ కాలంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అలైన్‌మెంట్ అక్రమాలు జరిగాయంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగానే ఈ కేసు నమోదు అయింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసును ఉపసంహరించుకునేందుకు సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయగా, ఏసీబీ కోర్టు దీనిపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఫిర్యాదు దారుడిగా ఉన్న ఆళ్ల అభిప్రాయం తప్పనిసరిగా తెలియజేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థ కేసు మూసేయాలని కోరుతున్న నేపథ్యంలో, దీనిపై తన అభ్యంతరాలు ఉంటే వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొంది.

గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తీసుకునే నిర్ణయం ఈ కేసులో కీలకంగా మారనుంది. దీంతో ఆయనను సంప్రదించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. కేసు ఉపసంహరణకు ఆళ్ల అంగీకరిస్తారా? లేక అభ్యంతరాలు వ్యక్తం చేసి న్యాయపోరాటాన్ని కొనసాగిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.

ఆళ్ల అభ్యంతరాలు తెలుపితే ఏసీబీ కోర్టు తీసుకునే తదుపరి నిర్ణయం ప్రభుత్వం కోసం సవాల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చంద్రబాబుపై ఉన్న పలు కేసులను ప్రభుత్వం వరుసగా ఉపసంహరించుకుంటూ వస్తుండగా, ఇతర కేసుల్లో ఫిర్యాదుదారులు ప్రభుత్వాధికారులే కావడంతో పెద్దగా ఆటంకాలు ఎదురుకాలేదు. అయితే ఈ కేసులో ఫిర్యాదుదారు వైసీపీ నేత కావడం వల్ల పరిణామాలు భిన్నంగా ఉండే అవకాశముంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి