స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది. ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అదే విధంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసే ప్రచారం జరిగినా, అది కూడా అనిశ్చితిలో పడింది.
ఈ నేపథ్యంలో మరో క్రేజీ కాంబినేషన్‌గా అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ ల కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిపై స్పష్టత ఇచ్చారు.
‘రవణం’ – మాస్ కాంబోలో కొత్త సినిమా
దిల్ రాజు మాట్లాడుతూ, “ప్రశాంత్ నీల్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘రవణం’ అనే సినిమాను మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించబోతున్నాం. కానీ ఇది ఇప్పట్లో కాదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘సలార్ 2’. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాకే ‘రవణం’ సెట్స్‌పైకి వస్తుంది,” అని వెల్లడించారు.
బన్నీ సినిమాల స్పీడ్ పెరుగుతోంది
ఇప్పటికే బన్నీ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ సినిమా చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోందని టాక్. ఇది నిజమైతే దేశంలోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. మరోవైపు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
దిల్ రాజు – బన్నీ బాంధవ్యంపై విశ్వాసం
అల్లు అర్జున్, దిల్ రాజు కాంబినేషన్లో గతంలో ‘ఆర్య’, ‘పరుగు’, ‘డీజే’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘ఐకాన్’ ప్రాజెక్ట్ ముళ్లబాటుపడగా, ఆ కథను మరో హీరోతో తెరకెక్కిస్తామని దిల్ రాజు ఇప్పటికే వెల్లడించారు.
తమ్ముడు ప్రెస్మీట్లో వివరణ
నితిన్ హీరోగా రూపొందిన ‘తమ్ముడు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండటంతో దిల్ రాజు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన సోదరుడు శిరీష్ ‘గేమ్ ఛేంజర్’పై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “తమ్ముడు ప్రమోషన్లలో ఉన్నప్పుడు, మీరు ‘గేమ్ ఛేంజర్’ గురించి ఎందుకు అడుగుతారు?” అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.



